
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటూ చేయూత అందిస్తానని, ఆపద ఉన్నవారు సమాచారం అందిస్తే తప్పకుండా స్పందిస్తానని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడిదల ప్రణవ్ అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో వివిధ కారణాల వల్ల అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను శుక్రవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధులు కొంతవరకు కుటుంబాలకు భరోసాగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలలో చికిత్సలు జరుగుతున్నాయని, రోగులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్లను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అదనపు బెడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








