
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని వివిధ కుంటల, చెరువుల భూములను పలువురు అక్రమంగా కబ్జా చేశారని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, డీబీఏం 16 ఉప కాలువ1ఎల్ మాజీ వైస్ చైర్మన్ సొల్లు బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శంకర్ లు డిమాండ్ చేశారు. సోమవారం వారు పట్టణంలోని పలుచోట్ల కబ్జాకు గురైన స్థలాలను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ… హుజురాబాద్ పట్టణంలో సాగు, తాగు అవసరాల కోసం మోడల్ చెరువు, గుండ్ల చెరువు, గంగోని కుంట, బట్టోని కుంట, చంద్రవానికుంట, పీతిరుకుంట, ఎర్రకుంటలు గతంలో ఉండేవని అన్నారు. జమ్మికుంటరోడ్ లోని చంద్రవానికుంట స్థలాన్ని పలువురు కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. మరి కొంతమంది ఎఫ్టి ఎల్ ప్రాంతంలో, బఫర్ జోన్ లో కూడా నిర్మాణాలు చేపట్టారని వెంటనే ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణ చేసి కుంటను కాపాడాలని అన్నారు. ఎర్రకుంట దాదాపుగా అన్యాక్రాంతమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాడ సమీపంలో ఉండే గంగోని కుంట స్థలం కూడా చాలా మటుకు ఆక్రమణకు గురయ్యాయని, గతంలో అధికారులు ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా కొంతమంది గంగోనీ కుంట స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. డిబిఎం 16 ఉప కాలువ 1ఎల్ గతంలో 33 ఫీట్ల వెడల్పుతో ఉండేదని ప్రస్తుతం కాలువ వెడల్పు పూర్తిగా తగ్గిపోయిందని వెంటనే చిన్న నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి కాలువ హద్దులను నిర్ణయించి ఆక్రమణకు గురైన వాటిని తొలగించి మిగతాది ఆక్రమణకు గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ కాలువ ద్వారా గుండ్ల చెరువుకు నీరు చేరడం వల్ల రైతులకు సాగు, ప్రజలకు తాగు నీరు లభిస్తుందని అన్నారు. బుడగ జంగం కాలనీలోని బట్టోని కుంట కూడా చాలా మటుకు కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జాలు చేశారని వెంటనే అధికారులు స్పందించాలని కోరారు. కబ్జాలలో కూడా కొంతమంది టెక్నికల్ గా అధికారులకు దొరకకుండా ఉండేందుకు ఒక స్థలాన్ని కొన్ని రోజుల్లోనే ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు కొనుక్కొని లింకు డాక్యుమెంటును సంపాదిస్తున్నారని వారు ఆరోపించారు. హుజురాబాద్ పట్టణంలో హనుమాన్ గుడి స్థలాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని ఉన్నత పాఠశాల స్థలాన్ని విడిచిపెట్టకుండా కబ్జాలు చేశారని వారు పేర్కొన్నారు. హైదరాబాదులో కబ్జాలపై హైడ్రా మాదిరి చర్యలు తీసుకున్నట్లుగానే హుజురాబాద్ లో కూడా ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడడానికి అధికారులు కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంబంధిత ప్రభుత్వాధికారులు కబ్జా భూములను కాపాడడానికి చర్యలు చేపట్టకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు.







