
–ప్రపంచంలోనే నంబర్ వన్ అవినీతిపరులు బీఆర్ఎస్ నేతలే..!
–పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే* కనిపిస్తుంది..
–దోచుకు తిన్నోడికి
దోపిడీయే గుర్తు వస్తుంది..
–కాంట్రాక్టర్లకు తక్కువకు
ఇచ్చుడు అంచనాలను పెంచుడు
బీఆర్ఎస్ కు అలవాటే..!
–సిట్టింగ్ జడ్జితో విచారణకు
సిద్ధమా కేటీఆర్ తేల్చుకో..
–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
క్షమాపణలు చెప్పాలి..
–పరిపాలన అనుమతులు ఇచ్చిందే 3516 కోట్లు అయితే 8,888 కోట్ల ఫిగర్ ఎక్కడ నుంచి వచ్చిందో కేటీఆర్ వెల్లడించాలి..
–మంత్రి పొంగులేటి సవాల్ కు
పారిపోయినవ్..
–దమ్ముంటే బహిరంగ చర్చకు రా
లేకపోతే తోక ముడుచుకొని ఉండు..
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఫైర్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ప్రపంచంలోనే బీఆర్ఎస్ నేతలకు మించిన అవినీతిపరులు ఎవరూ లేరని, పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు వారి వైఖరి ఉందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలకులు వివిధ ప్రాజెక్టులను తక్కువకు కాంట్రాక్టర్లకు అప్పగించి తర్వాత ప్రజాధనం దోచుకునేందుకు ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారని ఆరోపించారు. మంగళవారం వెలిచాల రాజేందర్ రావు విలేఖరులతో మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలు గత పదేళ్ల కాలంలో వారు చేసిన అక్రమాలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. రూ.
3016 కోట్లకు సంబంధించిన అమృత్ టెండర్లపై నానాయాగి చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ గత బీఆర్ఎస్ పాలనలో పెంచిన అంచనాలు, అవకతవకలపై ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ అవకతవకలపై కచ్చితంగా విచారణ జరిపి తీరుతుందని పేర్కొన్నారు. వీటన్నింటినిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నావా..! కేటీఆర్ అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఒక అబద్దాల కోరు అని, అభాండాలు వేయడంలో దిట్ట అని ధ్వజమెత్తారు. అవగాహన రాహిత్యంతోనే అమృత్ టెండర్లపై ఆరోపణలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు సెక్రెటరీ నిర్మాణం దాకా అన్నిట్లో గత బీఆర్ఎస్ సర్కార్ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అంచనాలు అమాంతం పెంచిందని ఆరోపించారు. ఇలా లక్షల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని గత పాలకులు దండుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారాలు అన్నింటిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని తెలిపారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు తక్కువకు ఇచ్చుడు తర్వాత అమాంతం పెంచుడు గత బీఆర్ఎస్ పాలకుల ఘన నిర్వాకమని పేర్కొన్నారు పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు ఉన్నది బీఆర్ఎస్ నేతల వైఖరి అని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే భూతద్దం పెట్టి వెతికినా బీఆర్ఎస్ నేతల లాగా వైఖరి ఎక్కడా కూడా కనిపించదని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా 80190 కోట్లు కాగా, పెరిగింది 1,25,000 కోట్లు, సెక్రటేరియట్ నిర్మాణానికి అంచనా 400 కోట్లు, పెంచింది వెయ్యి కోట్లు అని మండిపడ్డారు.
కలెక్టరేట్ల నిర్మాణానికి అంచనా 1500 కోట్లు కాగా పెంచింది 1850 కోట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి అంచనా 400 కోట్లు పెరిగింది 600 కోట్లు, అమరవీరుల స్మారక జ్యోతి నిర్మాణానికి అంచనా 80 కోట్లు పెరిగింది 177 కోట్లు, అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అంచనా 104 కోట్లు పెరిగింది 165 కోట్లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి అంచనా 1100 కోట్లు కాగా పెంచింది 1725 కోట్లు, ప్రగతి భవన్ నిర్మాణానికి 38 కోట్లు అంచనా కాగా, పెంచింది 46 కోట్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి అంచనా 30 వేల కోట్లు పెరిగింది 40,000 కోట్లు ఇదంతా గత బిఆర్ఎస్ సర్కారు ఘనత అని ధ్వజమెత్తారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి సంబంధించి అంచనాల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వం ఎంక్వయిరీ చేయిస్తున్నదని స్పష్టం చేశారు. ఒక్క మిషన్ భగీరథ పథకంలో 20వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా ఇంత అవినీతి జరిగినట్లు లేదని, బీఆర్ఎస్ నేతలను ఉరి తీసిన తక్కువేనని ధ్వజమెత్తారు. గత బిఆర్ఎస్ పాలకులను అవినీతి వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసిb దోషులను కఠినంగా శిక్షిస్తుందని వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అక్రమాలు జరగాయని సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు దోచుకుతున్న చరిత్ర మీది కాదా.. అని కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేయడం మానుకోవాలని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు.
అమృత్ టెండర్లలో అక్రమాలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సవాల్ కు కేటీఆర్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో కంటే తక్కువ అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లకు పిలిచిందని, ఈ విషయం కూడా కేటీఆర్ కు తెలియకపోవడం అజ్ఞానమని పేర్కొన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు ఎక్కడికైనా వస్తానని మంత్రి పొంగులేటి సవాల్ విసిరితే తోక ముడిచిన నైజాం నీది కాదా.. కేటీఆర్ అని ధ్వజమెత్తారు.
అమృత్ టెండర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిందే 3516 కోట్లకు అని, 8,888 కోట్ల టెండర్ అని కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన అంచనాల విలువ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లపాటు అబద్ధాలతో ప్రజలను వంచించారని ప్రతిపక్షంలో కూడా అబద్ధాలు ఆడితే ప్రజలు ఛీకొడుతారని జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కు సూచించారు. పదేళ్లపాటు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అమృత్ టెండర్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేసినందుకు ముఖ్యమంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జన్మలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయనని కేటీఆర్ ముక్కు భూమికి రాయాలని సూచించారు.
రాష్ట్రంలో 98 ప్రాంతాల్లో పనులు చేసేందుకు గత సంవత్సరం సెప్టెంబర్ 20న గత బిఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని రాజేందర్ రావు పేర్కొన్నారు. తెల్లవారితే పోలింగ్ ఉండగా నవంబర్ 29న ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే 3516 కోట్ల బిడ్ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెరిచిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే లోపే 3.99 శాతం అదనానికి మూడు కంపెనీలకు కట్టబెట్టిందని తెలిపారు. డిసెంబర్ 7 న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ టెండర్ల విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని దీంతో వాటిని రద్దు చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారమే మళ్లీ టెండర్లు పిలిచిందని, ఓపెన్ టెండర్లలో అర్హత సాధించిన వారికే కాంట్రాక్టు దక్కిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక సీటు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అర్థంపర్థం లేని ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఆరోపించినట్లుగా సోదా కంపెనీ ఎండి సృజన్ రెడ్డి సీఎం సొంత బావమరిది కాదని, లేని బంధుత్వాలను అంటగట్టడం కేటీఆర్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు.

అసత్యాలను సత్యాలుగా, అభాండాలు వేయడంలో కేటీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చేతకాకపోతే తోక ముడుచుకొని ఉండాలని సూచించారు.నిజానికి సృజన్ రెడ్డి కేటీఆర్ కే దగ్గర మనిషి అని ఆరోపించారు. సృజన్ రెడ్డి మామ కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేత అని తెలిపారు. మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ బీఆర్ఎస్ దగ్గరి వ్యక్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు అనడం అజ్ఞానమే అవుతుందని హితవు పలికారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, అభూత కల్పనలను ప్రజలపై రుద్దడం ఇకనైనా మాను కోవాలని హెచ్చరించారు.
10 ఏళ్ల కాలం పాటు దోచుకున్న చరిత్ర మీద అని ఆరోపించారు. మీ కుటుంబం దోచుకు తిన్నట్లు ప్రపంచంలో ఎవరూ దోచుకు తినలేదని ఆరోపించారు. ప్రజాధనాన్ని ప్రజలకు కాకుండా తమ బంధువులకు దోచిపెట్టిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆరోపించారు. కెసిఆర్, కేటీఆర్ హరీష్ రావు ప్రజలను మోసం చేశారని, కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజాధరణ పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆభాండాలు వేస్తున్నారని, ఇదంతా ప్రజలంతా గమనిస్తున్నారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. వాస్తవాలు మసలు కొని మెలగాలని హితవు పలికారు.





