
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డెంగ్యూ వ్యాధి లక్షణాలతో రక్త కణాలు తగ్గి నిన్న రాత్రి మృతి చెందిన హుజురాబాద్ పట్టణంలోని 30వ వార్డుకు చెందిన చిన్నారి రావుల రిషిత(10) ఇంటి సమీపంలో చెల్పూర్ పిహెచ్ సి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. రావుల రిషిత కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల 50 ఇళ్లల్లో ప్రజల రక్త నమూనాలు సేకరించారు. వీధుల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమల వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రిషిత రక్త కణాలు తగ్గి వైరల్ ఫీవర్ తో చనిపోయిందని డెంగ్యూ వ్యాధిగా ఆమెను పరీక్షించిన వైద్యులు నిర్ధారించలేదని, ప్రజలందరూ డెంగ్యూ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ వైద్యాధికారి మధుకర్, వైద్యురాలు డాక్టర్ జరీనా, హెల్త్ ఎడ్యుకేటర్ టి ప్రతాప్, హెల్త్ సూపర్వైజర్ కే సత్తయ్య, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.







