
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని
భారతియ జనతా పార్టీ హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ఐకేపి సెంటర్లు మరియు ప్రాథమిక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసే కొనుగోలు సెంటర్లను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడ కొనుగోలు కాలేదని ప్రస్తుత సీజన్లో రైతులు వరి పండించిన రైతులు వరి ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబోసి కొనుగోలు చేయడం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు మొదలు పెట్టలేదన్నారు. హడావిడిగా ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించినప్పటికీ ధాన్యం నిలువకు ఎక్కడ మిల్లులు అలాట్మెంట్ చేయకపోవడంతో కొనుగోలు ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటికే రెండు మూడు తుఫాన్లు రావడంతో రైతులు కొనుగోలు కేంద్రాలలో తార్పాలిన్లు, కవర్లు లేక మబ్బు వస్తుందంటే చాలు నిద్రాహారాలు మాని తమ ధాన్యం తడవకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, చేసినప్పటికీ కొనుగోలు మొదలు కాలేదు అన్నారు. ఈ విషయమై ఐకెపి, ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులను సంప్రదించగా మాకు ఎక్కడ ధాన్యం నిల్వ చేయడానికి మిల్లులు అలాట్మెంట్ కాకపోవడంతో కొనుగోలులో జాప్యం చేయడం జరుగుతుందని తెలిపారన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని సెంటర్లకు మిల్లులు అలాట్మెంట్ చేసి కొనుగోలు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సన్న వడ్ల కొనుగోలులో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో సన్న వడ్లు పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికే కల్లల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు వచ్చిన కాడికి అమ్ముకొని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లా మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి వెంటనే స్పందించాలన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు గాని స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గానీ ఇప్పటివరకు కొనుగోళ్ల విషయంలో ప్రేక్షక పాత్ర వహించడం రైతులను ఆందోళన గురిచేస్తుందన్నారు. తక్షణమే వీరు ఇరువురు చొరవ తీసుకొని అన్ని కేంద్రాలలో వడ్లు కొనుగోలు ప్రారంభమయ్యేలా చూసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుందన్నారు. సన్నవడ్లు కొనుగోలు చేసి బోనస్ ఎకరానికి ఎన్ని క్వింటాళ్లు పండితే అన్ని క్వింటాల్లకు 500 చొప్పున బోనస్ చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణతో పాటు శాసనసభకు ఎన్నికలు జరిగిన ఒరిస్సాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత సీజన్లోనే సన్న, దొడ్డు రకాలకు అన్నిటికీ బోనస్ 500 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిందని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గతంలో కొనుగోలు చేయలేదన్నారు. ఇప్పుడు కూడా కేవలం సన్నవడ్లకే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎక్కడ ఒక గింజ కూడా కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. ఆరుకాలం కష్టం చేసి పండించిన ధాన్యం కల్లాలవద్దె ఉండడంతో రైతులు తమ కల్లాల వద్ద అరిగోసపడుతున్నారన్నారు. రైతుల కష్టం ఈ ప్రభుత్వానికి కనబడతలేదా అని ఈ సందర్భంగా బిజెపి నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఎక్కడెక్కడ గోదాములు ఖాళీలు ఉన్నా కొనుగోలు చేసి గోదాములకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని లేదా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులందరికీ ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కవర్లు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ తరఫున పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రాముల కుమార్, ఉపాధ్యక్షులు మేకల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, మండల కార్యదర్శి చీదురాల శ్రీనివాస్ రెడ్డి, యువమోర్చా మండల అధ్యక్షుడు నరేడ్ల చైతన్యరెడ్డి, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు మండల సాయిబాబా, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పంజాల వెంకన్నగౌడ్, చెల్పూర్ నాలుగో భూత్అధ్యక్షులు కొన్ని ప్రవీణ్ పాల్గొన్నారు.






