Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జఫర్ గడ్ నవంబర్26: అందరూ అభిమానించే శతక సాహిత్యంతోనే తెలుగు భాషా మాధుర్యం గుబాళిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు విశ్రాంత ప్రధానాచార్యులు పొడిచేటి శ్రీనివాసాచారి అన్నారు. మండల కేంద్రమైన జఫర్ గడ్ లోని వేల్పుగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, ఆలయ బ్రహ్మోత్సవాల పర్వంలో భాగంగా ప్రముఖ రచయిత్రి హుజురాబాద్ కు చెందిన డాక్టర్ దివిటి అంజనీదేవి కలం నుంచి జాలువారిన శ్రీ వేల్పుగొండ లక్ష్మీనరసింహ శతకాన్ని ఆయన ఆలయ అర్చకులు ఠయ్యాల కృష్ణమాచార్యులు పొడిచేటి వెంకటాచార్యులతో కలిసి సోమవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసచార్య మాట్లాడుతూ డాక్టర్ అంజనీదేవి తమ ఇష్ట దైవమైన వేల్పుగొండ పై అద్భుతమైన సాహిత్యంతో పాఠకుల మనసు రంజింపజేసేలా శతకాన్ని వెలువరించడం అభినందనీయమన్నారు. భక్తిలో ప్రామాణికమైనది ఏది లేదంటూ శరణు నరసింహ శరణు అనే మకుటంతో ఆటవెలది పద్యాలతో సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా శతకం రాయడం అభినందనీయం అన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవ పర్వం, కల్యాణ వైభవం, పుష్పయాగం లాంటి ముఖ్య ఘట్టాలను రచయిత్రి తన శతకంలో అద్భుతంగా వర్ణించిన తీరు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుందని శ్రీనివాసాచారి అన్నారు. గతంలో డాక్టర్ దివిటి అంజనీదేవి సమ్మక్క సారాలమ్మ జాతర విశేషాలను పరిశీలన గ్రంథంగా వెలువరించారు. అదే విధంగా కాంతి కిరణాలు అంజనమ్మ శతకాన్ని కూడా ఆమె రచించారు. తాజాగా తన ఇష్ట దైవమైన వేల్పుగొండ లక్ష్మీనృసింహ శతకాన్ని రాయడమే కాక
ఆ స్వామివారికి ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వడం విశేషం.
ఈ సందర్భంగా ఆకుల సునితాదేవి, అంచురి కమల, తిరునగరి సాహితి, విజయలక్ష్మి తదితరులు అంజనీదేవిని ఘనంగా సత్కరించారు.
న్యాయవాది యతిపతి అరుణ్ కుమార్,నిరంజన్ కుమార్, టి.నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






