
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా పథకాలకు లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల వివరాలు నమోదు చేయాలన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇంటింటికీ వెళ్లి కుటుంబ ఆర్థిక స్థితిగతులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం నిబంధనలు పాటించాలని సూచించారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి గ్రామసభలు నిర్వహించాలన్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, డీడబ్ల్యూవో సబిత, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
రైతుభరోసా సర్వే పరిశీలన
హుజురాబాద్ మండలం బోర్నపల్లి శివారులో చేపట్టిన రైతు భరోసా సర్వేను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. కేవలం సాగు చేస్తున్న భూములనే రైతు భరోసా కింద నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయేతర భూములు, ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు ఉంటే వాటిని మినహాయించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమేష్ బాబు, తహసీల్దార్ కనకయ్యను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.









