
–చిర్రాకుంటకు కాకతీయ నీళ్ళు
–దమ్మక్కపేట అభివృద్ధి చేస్తా అంటున్న బిజెపి నేత రవీందర్ రెడ్డి మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి 18: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 9 వ వార్డు (దమ్మక్కపేట) నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని, తద్వారా చైర్మన్ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని “కుందనపల్లి” కుటుంబం వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో దమ్మక్కపేట కేంద్రంగా ఉన్న 9 వ వార్డు జనరల్ స్థానం అయింది. ఇక్కడి బిజెపి నాయకుడు కుందనపల్లి రవీందర్ రెడ్డి మహిళ అభ్యర్థి గా తన సతీమణి సతీమణి గీత ను బరిలో దింపారు. బి ఆర్ ఎస్ అభ్యర్థి చేతిలో 9 ఓట్ల తో ఓటమి చెందారు. కానీ ఈసారి ఎలాగైనా ఇక్కడినుండే కౌన్సిలర్ గా గెలిచి చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని రవీందర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణంలో బీజేపీకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లోను చెప్పుకోదగ్గ సీట్లను ఆ పార్టీ సంపాదించింది. 2021 లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచింది. దీనితో బీజేపీ బలం పట్టణంలో అన్ని వార్డుల్లో పెరిగింది. ఈ కారణంగా అర్ధ బలం, అంగ బలం ఉన్న రవీందర్ రెడ్డి గత కొద్దిరోజులుగా గ్రామంలో నే మకాం వేసి కౌన్సిలర్ స్థానం కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. పట్టణంలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దింపి వారి గెలుపుకు అన్ని రకాలుగా సహకారం అందించి, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే వ్యూహం చేస్తున్నారు. 2019 కి ముందు దమ్మక్కపేట్, ఇప్పల్ నర్సింగపూర్, కొత్తపల్లి గ్రామాలు మున్సిపాలిటీ లో విలీనం అయ్యాయి. మునిసిపాలిటీలో విలీనం అయినప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. దమ్మక్కపేట్, కేసీ క్యాంప్ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై ఈ గ్రామం ఉండడంతో శరవేగంగా అభివృద్ధి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. దమ్మక్కపేట్ సమీపంలో నుండి వరంగల్ కరీంనగర్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. హుజురాబాద్ పట్టణంలో తాగునీటి నీటి సమస్య పెద్దగా లేదు. కానీ దమ్మక్క పేట లో తాగు, సాగు నీటి ఎద్దడి ప్రతి వేసవిలో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్నారు. ఇందుకుగాను దమ్మక్కపేటలోని చిర్రాకుంట ను ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా నింపేందుకు పైపు లైన్ నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనిని టెండర్ ద్వారా దక్కించుకొని పూర్తిచేసేందుకు రవీందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. 2019 లో కౌన్సిలర్ గా ఓడిన సానుభూతి, చైర్మన్ రేసులో ఉండే విధంగా పట్టణంలో అన్ని వర్గాలతో మంచి సంబంధాలు నెరిపేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ ను బట్టి సతీమణి గీతను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
బీజేపీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తా : రవీందర్ రెడ్డి
రాబోయే హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని, మునిసిపాలిటీపై కాషాయ జెండాను ఎగరేస్తామని ఆ పార్టీ నేత కుందనపల్లి రవీందర్ రెడ్డి అన్నారు. దమ్మక్కపేట కేంద్రంగా ఉన్న 9 వ వార్డులో స్వల్ప ఓట్లతో గతంలో ఓటమి చెందామని, వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్ ను అనుసరించి కౌన్సిలర్ గా బరిలో ఉంటామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బలమైన కేడర్ బిజెపి పార్టీకి ఉందని గుర్తు చేశారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఈసారి బిజెపిని కోరుకుంటున్నారని అన్నారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి తన సత్తా చాటిందని అన్నారు. యువత, మహిళలు, రైతులు బిజెపిని కోరుకుంటున్నారని, ముఖ్యంగా పట్టణ ఓటర్లు విద్యావంతులని, వారంతా బిజెపికి అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మునిసిపాలిటీని కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తాయని అన్నారు. ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తమ పార్టీకి ఉన్నాయని, సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఆయన అన్నారు.








