
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మార్చి 21: హుజూరాబాద్ ప్రాంత ప్రజలు చెత్తను రోడ్ల పై వేయకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, తద్వారా స్వచ్చ హుజూరాబాద్ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ప్రపుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు చెత్త డబ్బాలు అందించి, మున్సిపల్ నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రజలతో కలిస అంబేద్కర్ చౌరస్తా నుండి హైస్కూల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ సభలో ఆయన మాట్లాడుతూ.. పరిశుభ్రత ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, పరిశుభ్రత కోసం మున్సిపల్ సిబ్బందితో ప్రజలు సహకరించాలని కోరారు. హుజురాబాద్ చైతన్యవంతమైన ప్రాంతమని ఆరోగ్య రక్షణలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. స్వచ్ఛ హుజూరాబాద్ సాధనకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల మద్దతు అవసరమని అన్నారు. పరిసరాల పరిశుభ్రతకు, హరితహారంకు విశేషంగా కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త వర్ధి నేని రవీందర్ రావును అదనపు కలెక్టర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, ఐఈసీ ఎక్స్ పర్ట్ ఫణి, అంగన్ వాడీ సూపర్ వైజర్ పద్మ, మున్సిపల్ ఏఈ సాంబరాజు, మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జె. శ్రీకాంత్, MD రషీద్, సానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్ తాళ్లపెల్లి శ్రీనివాస్, హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, మెప్మా CLRP & RPలు, పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.









అంబేద్కర్ చౌరస్తాలో మొక్కలు నాటుతున్న ప్రత్యేక అధికారి..





