Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, నిబంధనలు పాటించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు పాఠశాల ఫీజుల వివరాలను తప్పనిసరిగా బోర్డుపై ప్రదర్శించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకుడు తాళ్లపల్లి మైఖేల్ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అనేక ప్రైవేటు పాఠశాలలకు క్రీడా మైదానాలు లేకపోయినా,వాటిని ఉన్నట్లుగా చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు అధిక ఫీజు వసూళ్లను పట్టించుకోవడం లేదని, దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు మైఖేల్ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీజేపీ నాయకుడు జంపాల రాజు పాల్గొన్నారు.






