
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన స్వగ్రామమైన వీణవంక మండలంలో చేసిన అభివృద్ధి ఎక్కడ? అని కాంగ్రెస్ యువ నాయకుడు ప్రశాంత్ పటేల్ మద్దుల విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. కనీసం గా సొంతూరుని కౌశిక్ అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీగా సుమారు రెండేళ్లు ఉన్న, ఎమ్మెల్యేగా ఏడాది దాటుతున్నా నియోజకవర్గ అభివృద్ధిపై కనీస పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ ను విమర్శించడానికి బీఆర్ఎస్ నాయకులకు నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి రూ.1000 కోట్లు అని చెప్పి.. కనీసంగా నియోజకవర్గంలో పట్టించుకోకుండా.. విదేశీ పర్యటనలు చేస్తూ.. కాలాన్ని వెల్లదీస్తున్నారని విమర్శించారు.
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే జననేత ప్రణవ్ బాబు అని వెల్లడించారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సైతం హుజురాబాద్ నియోజకవర్గానికి పైసా పనిచేయని నాయకుడు కౌశిక్ రెడ్డి అని విమర్శించారు. తన సొంత మండలం అయిన వీణవంకలో డబుల్” బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందించాలనే సోయి లేని నేత ఎమ్మెల్యే అని ప్రశాంత్ విమర్శించారు. “డబుల్” ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్న ..స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కనీస పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్.. ప్రజా క్షేత్రంలో చేస్తున్న పనుల గురించి జనం అందరికీ తెలుసని వెల్లడించారు. ప్రణవ్ బాబు తాతల కాలం నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజా సేవ చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి మరోసారి గెలిచే దమ్ముందా? అని సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం చేసిన పనులు ఏమిటో కౌశిక్ రెడ్డి చెప్పాలని అడిగారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై ప్రజాక్షేత్రంలో చర్చకు కాంగ్రెస్ నాయకులు అయిన తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రణవ్ కనీసం గా వార్డు మెంబర్ గా గెలవలేడని గులాబీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని, కానీ, ఆయన తాతల కాలం నుంచి రాజకీయం ఆ కుటుంబం నుంచి కొనసాగుతున్నదని, ఆ సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. మరోసారి తమ జననేత ప్రణవ్ జోలికి వస్తే ఊరుకునేది లేదని ప్రశాంత్ పటేల్ హెచ్చరించారు.

విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ పటేల్






