
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: దేశ స్థూల జాతీయ అభివృద్ధి సూచీకలో అగ్రభాగాన ఉన్న వ్యవసాయ రంగాన్ని విరివిగా ప్రోత్సహించి అన్నదాతల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
విస్తారమైన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండి రైతన్నల భూముల్లో సమృద్ధిగా పంటలు పండి వారు సంతోషంగా ఉండి అన్నదాతల ఇంట పండుగ వాతావరణం నెలకొనాలని సమాఖ్య తరపున మంగళవారం నగరంలో నిర్వహించిన ప్రపంచ వ్యవసాయ దినోత్సవ కార్యక్రమంలో అన్నదాతలకు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం అనేది వ్యాపారం కాదని అది జీవన విధానమన్నారు. నేలను తల్లిగా భావించి రక్తాన్ని చెమటగా చిందించి పండించిన పంటను రైతన్న దైవంగా భావించి
అందరి ఆకలి తీర్చే వరం లాంటి వ్యవసాయాన్ని గుర్తించి అన్నదాతల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధవహించాలని పోలాడి రామారావు కోరారు.
రైతుల పెట్టుబడి వ్యయం పెరిగిపోతున్న నేపథ్యంలో రైతులకు ఇప్పుడున్న గిట్టుబాటు ధరను అన్ని పంటలకు మరింతగా ప్రభుత్వాలు పెంచాలని, ఎరువులకు, క్రిమి సంహారక మందులకు యంత్ర పరికరాలకు విరివిగా సబ్సిడీలు సకాలంలో అందించాలని, రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, 50 ఏళ్లు నిండిన రైతన్నలకు నెలకు 5 వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు అందించే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, దహన సంస్కారాలకు 20 వేలు అందించాలని, రైతులకు 25 లక్షల వైద్య ఆరోగ్య భీమా ఏర్పాటు చేయాలని, రైతులకు పంట సాగు సమయంలోఎకరాల తో సంబంధం లేకుండా సాగు చేసిన అన్ని ఎకరాలకు ఎకరాకు 15 వేల చొప్పున పంట పెట్టుబడి సహాయాన్ని అన్నదాతలకు సకాలంలో అందించాలన్నారు.
.ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయిన రైతులకు గ్రామాన్ని యూనిట్ గా పరిగణించి ఎకరాకు 25 వేల రూపాయల పరిహారాన్ని తక్షణమే అందించాలని, దళారుల ప్రమేయం లేకుండా రైతుల వ్యవసాయ కళ్ళాల్లోనే నేరుగా ప్రభుత్వమే మద్దతు ధరతో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిపి 48 గంటల్లో రైతులకు వారి ఖాతాల్లో నగదు జమచేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. తమ పంట పొలాలల్లో గతంలోని మూస సాగు విధానాలకు స్వస్తిపలికి వాతావరణ మార్పులకనుగుణంగా అధునాతన సేంద్రియ, ఆర్గానిక్ వ్యవసాయం విధానాలను రైతులు పాటించి అధిక దిగుబడులు సాధించే విధంగా ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించి చైతన్య పరచాలని రామారావు కోరారు.
రైతులకు తమ ప్రైవేట్ అప్పులను తీర్చుకోవడానికి బ్యాంకుల నుండి ఋణాలు తీసుకునే అవకాశం ఉందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు గుర్తింపు దక్కడం లేదని పారిశ్రామికీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా మారడం, రైతులను చిన్న చూపు చూడడం దురదృష్టకరమని పోలాడి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు రైతు కూలీలకు న్యాయం జరగాలంటే వారికి అన్ని శాఖల్లో రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే సంపన్నుల ఆధిపత్యంలోనే వ్యవస్థలు ఉండి పోయి కర్షకులకు న్యాయం జరగదని జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల వ్యక్తం చేసిన అభిప్రాయాలతో దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని ఇది శుభ పరిణామమని అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయాలకనుగుణంగా రైతులకు అన్ని రంగాల్లో తగిన గుర్తింపు కోసం,ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు రాజకీయాల కతీతంగా రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లక్ష్య సాధన, దీర్ఘ కాలిక దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని పోలాడి రామారావు ప్రకటించారు. తాము చేపట్టబోయే ఉద్యమ పంథా రైతన్నలకు, రైతు కూలీల అభ్యున్నతికి నవ శకానికి నాంది పలుకుతుందని రామారావు విశ్వాసం వ్యక్తం చేస్తూ అన్నదాత సుఖీ భవ అంటూ అన్నదాలందరికి నేడు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.

రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు







