
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ రాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, తెలంగాణ ముద్దు బిడ్డ బోయినపల్లి వినోద్ కుమార్ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల మద్దతు కోసం చేసిన లాబీయింగ్ అమోఘమని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
కరీంనగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలో పోలాడి రామారావు పాల్గొని నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన తర్వాత మాట్లాడారు.
తెలంగాణా రాష్ట్ర సాధనలో డిల్లీ వేదికగా జాతీయ రాజకీయ పార్టీల మద్దతు కోసం వినోద్ కుమార్ విశేషంగా లాబీయింగ్ చేసి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించి దేశవ్యాప్తంగా మన గళాన్ని వినిపించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్ళు, నిధులు నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని పాలకుల వివక్షను పార్లమెంట్ సాక్షిగా ఎలుగెత్తి ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ అనర్గళంగా సమర్ధ వంతంగా వినిపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతులకు పెట్టుబడి సహాయం కోసం తమ ప్రజా సంఘాల వినతి మేరకు అప్పుడు ఎంపీగా ఉన్న బోయినపల్లి సీఎం కేసీఆర్ కు వివరించి రైతు బంధు పథకం ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించారన్నారు. స్మార్ట్ సిటి స్కీమ్ కు సరిపడే అర్హత జనాభా లేకున్నా అప్పటి కేంద్ర పట్టణాభవృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడును ఒప్పించి కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీ పథకం క్రింద ఎంపిక చేయించడంతో నేడు కరీంనగర్ పట్టణ అభివృద్ధిలో వినోద్ కుమార్ కృషి మరువలేనిదని రామారావు కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి పారుదల నూతన కాలువలకు ముఖ్యంగా సిరిసిల్ల చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్, మానకొండూర్ ప్రాంతాల రైతులకు వినోద్ కుమార్ చొరవతో ఎంతో మేలు చేకూరిందన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల, వాకింగ్ వ్యాయాయమ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. పార్కుల అభివృద్ది,
జాతీయ రహదారుల నిర్మాణం ముఖ్యంగా సిద్దిపేట్ నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు అలాగే వరంగల్ – కరీంనగర్ – జగిత్యాల నూతన గ్రీన్ ఫీల్డ్ రహదారుల రూపకల్పనకు వినోద్ అధికారుల వెంట పడి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి అట్టి రహదారుల మంజూరిలో ప్రముఖ పాత్ర వహించారని, సదాశివపల్లి మానేర్ నదిపై తీగల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించారనన్నారు. రివర్ ఫ్రంట్ నిర్మాణం వేగవంతం చేశారన్నారు. వినోద్ కుమార్ పార్లమెంట్లో లేని లోటు నేడు స్పష్టంగా కనబడుతుందన్నారు. అన్ని వర్గాల సమస్యలు ఆలకించి పరిష్కరించే బోయినపల్లి వినోద్ కుమార్ కు రైతు ప్రజాసంఘాల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు
పెండ్యాల కేశవరెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, పెండ్యాల రాంరెడ్డి, బుస్సా శ్రీనివాస్, డాక్టర్ దీపక్ బాబు, అండెం రమణా రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న పోలాడి రామారావు…





