
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 30: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ బుధవారం హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో గల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయన విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పాఠశాల భవన నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సందర్భంగా శ్యామ్ లాల్ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులకు మెనూ ప్రకారం సమయానికి ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థుల పట్ల ఎటువంటి అశ్రద్ధను సహించబోమని స్పష్టం చేశారు. అనంతరం, పాఠశాలలోని వంటగది, డైనింగ్ హాల్, తరగతి గదులు, విద్యార్థుల వసతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై గడువు తేదీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని హెచ్చరించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం సహించ కూడదని పునరుద్ఘాటించారు. బిల్డింగ్అవసరాలపై దృష్టి, ఏమైనా అవసరాలుంటే ఎస్టిమేషన్ వేయించి కాపీని వెంటనే పంపించాలని ఆదేశించారు. అలాగే, పాఠశాల భవనానికి పెయింటింగ్ పనులను త్వరలో పూర్తి చేయించాలని సూచించారు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తమ విధులను సమయపాలనతో నిర్వర్తించాలని, విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ప్రిన్సిపాల్ శారద, ఆర్ఐ రంజిత్ రెడ్డితో పాటు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.



మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో రిజిస్టార్లను పరిశీలిస్తున్న గురుకులాల జాయింట్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్

వంట గదిలో పరిశీలిస్తున్న శ్యామ్ ప్రసాద్ లాల్





