
– ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా..జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలో ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ… మెజారిటీ జర్నలిస్టుల జీవన పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఒరిగిందేమి లేదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు రవీందర్, సంతోష్, భానుచందర్, యోహన్, రాజేంద్రప్రసాద్, సమ్మయ్య, విజయ్ కుమార్ జర్నలిస్టులు పాల్గొన్నారు.









