Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాజ అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు ఎనలేనివని, ఉపాధ్యాయుల బోధనలతో రేపటి భావి భారత పౌరులు తయారవుతారని హుజురాబాద్ ఎంఈఓ బి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో హుజురాబాద్ మండలస్థాయి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేపటి తరం బాగుపడాలంటే ఉపాధ్యాయులు చేసే కృషి గొప్పదని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య మాట్లాడుతూ…. రేపటి తరం బాగుందంటే అది ఉపాధ్యాయుల వల్లనే నని అన్నారు. ఈ సందర్భంగా వారి వారి సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరిచిన హుజురాబాద్ మండలంలోని 17 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను, 14 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రశంసా పత్రాలతో పాటు శాలువాలతో సత్కరించి సన్మానించారు. అయితే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విమర్శలకు తావిచ్చింది. జిల్లాస్థాయి అవార్డు తీసుకున్న వారిని, మండల కమిటీ ఎంపికకు ఎన్నిక చేసిన వారిని కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం విమర్శలకు కారణమైంది. ఎంఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారని అర్హులను వదిలి నామమాత్రంగా ఎంపిక చేయడం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు భాగ్యరేఖ, ఆదర్శన్ రెడ్డి, చక్రధర్, సంజీవ్, శ్రీనివాస్ సంపత్ పలువురు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.






