
పేద, మధ్యతరగతి ప్రజలకు రైతాంగానికి ఊరట కలిగించేలా జీఎస్టీ పై నరేంద్ర మోది ప్రభుత్వ చారిత్రక నిర్ణయం ..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ హయాంలో అంతటా దోపిడీ జరిగేదని, పన్నులు, ద్రవ్యోల్బణం రెండూ ఆకాశాన్ని తాకేవని, మోది ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని, పేద, మధ్యతరగతి ప్రజలకు రైతాంగానికి ఊరట కలిగించేలా జీఎస్టీ పై నరేంద్ర మోది ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ లో స్థానిక ట్రాక్టర్ షోరూమ్ లో శ్రీకాంత్ అనే వినియోదారుడు కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ ను బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు వల్ల వ్యాపారాలు, కొనుగోళ్లు పుంజుకున్నాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గూడ్స్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)ని సులభతరం చేస్తూ, పన్నుల భారాన్ని తగ్గించి పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అద్భుత నిర్ణయం తీసుకుందన్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల ప్రతీ పేద, మధ్యతరగతి కుటుంబానికి నేరుగా లాభం చేకూర బోతోందన్నారు. ముఖ్యంగా దినసరి అవసరాల వస్తువులు, గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గిపోతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పెరిగిన పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, పేదల అభ్యున్నతి పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిలువుటద్దం లాంటిదన్నారు. పండుగలో పేద కుటుంబాలు కూడా సంతోషంగా కొనుగోలు చేయగలిగేలా..నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూ, పేద కుటుంబాల రోజువారీ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుందన్నారు. ఇకపై ప్రజలకు తమ రోజువారీ అవసరాల కొనుగోళ్లపై భారీ ఉపశమనం లభిస్తుందని, దీంతో డబ్బు మిగిలి, గృహజీవనం సులభంగా మారనుందన్నారు. ప్రధాని మోదీ నిజాయితీ గల పాలన వల్లే జీఎస్టీ తగ్గింపు నిర్ణయం సాధ్యమైందన్నారు. ఈ నిర్ణయం వల్ల వర్తక వ్యాపారులకు కూడా మంచిరోజులు ప్రారంభమయ్యాయన్నారు. మోదీ పాలనలో ప్రజలకు అన్ని విధాల ఉపశమనం లభించేలా, సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించి, ముఖ్యంగా వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా జీఎస్టీ పై నిర్ణయాలు తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, డిజిటల్ సదుపాయాల్లో వేగంగా అభివృద్ధి జరిగేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందు కొనసాగుతుందన్నారు. దాని ఫలితాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. కాంగ్రెస్ పాలనలో భారమైన పన్నులతో ప్రజలు అల్లాడిపోతున్నారని, అటు తెలంగాణలోనూ, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజలపై ట్యాక్స్‌లు విపరీతంగా వేస్తున్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంపు, ఇంధన ధరలు పెంపు, మద్యం ధరలు పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు, బస్సు చార్జీలు పెంపు ఇలా అన్నీ సామాన్యుడి జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. పెట్టుబడులు రావడం లేదు, పరిశ్రమలు కుదేలవుతున్నాయి, రైతులు, ఉద్యోగులు నిరాశ చెందుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మండల అధ్యక్షులు రాముల కుమార్, బిజెపి సీనియర్ నాయకులు నల్ల సుమన్, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, పారుపల్లి కొండల్ రెడ్డి, తూర్పాటి రాజశేఖర్, మహేష్ రావుల పున్నం, పోచంపల్లి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.




నూతన ట్రాక్టర్ ను నడుపుతున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి





