
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఇసుక లోడింగ్లలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను ప్రజా అవసరాలకు రవాణా చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ ఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పీవో వినయ్తో కలిసి కరీంనగర్ జిల్లాలోని కొండపాక, బ్లాక్ 1, బ్లాక్ 2 ఇసుక క్వారీలను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన క్వారీల్లో జరుగుతున్న ఇసుక లోడింగ్ ప్రక్రియను, నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇసుక రవాణాకు సంబంధించిన పత్రాలను, డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది ప్రతి నిత్యం ఇసుక రవాణా, లోడింగ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనధికారిక రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని సూచించారు. ఇసుక రవాణాలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపాలని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎండి. భావేష్ హెచ్చరించారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లోడింగ్ సమయంలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి కూడా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్వారీల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇసుక రవాణా వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇసుక క్వారీ నిర్వహణ పర్యావరణ నిబంధనలకు లోబడి ఉండాలని ఆయన ఆదేశించారు.
ఈ తనిఖీలో టీఎండీసీ ఎండీ భావేష్ మిశ్రా, పీవో వినయ్ కుమార్ , పెద్దపల్లి పిఓ రాజు, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటేశ్వర్ రావు. మరియు టిజియండిసి సిబ్బంది పాల్గొన్నారు.


ఇసుక క్వారీని పరిశీలించి పీవో వినయ్ కుమార్, పెద్దపల్లి పిఓ రాజు, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటేశ్వర్ రావులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న టీఎండీసీ ఎండీ భావేష్ మిశ్రా





