
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఇల్లందకుంట): అంతర్జాతీయ పత్తి దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని లక్ష్మాజిపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర.. డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ, బీసీఐ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రైతులకు, కూలీలకు నాణ్యమైన పత్తి పండించడం కోసం పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణపై శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
బీసీఐ క్షేత్ర సహాయకుడు ఈరబోయిన సతీష్ మాట్లాడుతూ..మన తాత ముత్తాతలు సేంద్రియ వ్యవసాయం చేసి మనకు చక్కటి సారవంతమైన భూమిని, వాతావరణాన్ని కలుషితం కాకుండా మనకు అందజేశారని పేర్కొన్నారు. మనం కూడా మన భూమిని భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని..ప్రతీ రైతు వారి ఇంటి అవసరాల కోసం సహజ సిద్ధమైన సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. తద్వారా మన కుటుంబాన్ని, గ్రామాన్ని, దేశాన్ని సారవంతమైన దేశంగా మార్చగలుగుతామని స్పష్టం చేశారు.
ఈ సహజ సిద్ధమైన వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా వేపగింజల కషాయం, నీమాస్త్రం, వేస్ట్ డీకంపోజర్, జీవామృతం, ఘనజీవామృతం మొదలగు కషాయాల తయారీ విధానం గురించి వివరించినట్టు వెల్లడించారు. పంట ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటిన తర్వాత మాత్రమే తక్కువ విష ప్రభావం కలిగిన పురుగుమందులను బొట్టు పద్ధతిలో చేసుకోవాలని, పురుగు మందుల పిచికారి సమయంలో తప్పనిసరి సరైన పరికరాలతో సరైన వాతావరణ పరిస్థితుల్లోనే పిచికారి చేయాలని స్పష్టం చేశారు.
18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు పురుగుమందులపై శిక్షణ నైపుణ్యం కలిగి ఉండాలని, గర్భిణులు, బాలింతలు పిచికారి సమయంలో వెళ్ళినట్లయితే అనారోగ్యం, అంగవైకల్యం వస్తుందని హెచ్చరించారు. వాడిన పురుగుమందు డబ్బాలను నిర్వీర్యం చేయాలని, తద్వారా నీటి ఆవరణ వ్యవస్థ కాపాడవచ్చని తెలిపారు. రసాయన పురుగుమందులు, రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల రైతులకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
కావున రైతులు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలని సూచించారు. రసాయన పురుగుమందుల వాడకం వల్ల కలిగే నష్టాలు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. తదానంతరం ప్రపంచ పత్తి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సమావేశంలో గ్రామ రైతులు, కూలీలు మాట్లాడుతూ.. బీసీఐ ప్రాజెక్టు కోఆర్డినేటర్ బొట్ల సతీష్ కుమార్, క్షేత్ర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీఐ క్షేత్ర సిబ్బంది ఈరబోయిన సతీష్, కంచం అనిల్, రావుల రాకేష్, పెద్ది గణేష్, గ్రామ రైతులు మరియు కూలీలు పాల్గొన్నారు.


రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించిన అనంతరం పండ్లు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు..





