
– పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి
– చాతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
మృతురాలి కుటుంబానికి కౌశిక్ రెడ్డి 50వేల ఆర్థిక సాయం
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమకొండ జిల్లా వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న శ్రీ వర్షిత ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన చిన్నారికి న్యాయం చేయాలంటూ వర్షిత మృతదేహంను తనే స్వయంగా మోసుకొని వచ్చి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ – వరంగల్ ప్రధాన రహదారిపై చేపట్టిన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి మృతురాలి కుటుంబాన్ని న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో దానికి సానుకూలంగా కలెక్టర్ స్పందించడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వనం తిరుపతి కూతురు అయిన శ్రీ వర్షిత ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక మరణించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన ఆధీనంలో పెట్టుకొని పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ హయాంలో విద్యార్థులు అన్ని రకాల వసతులతో పాటు రక్షణతో కూడిన విద్యను అందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలతో మొదలుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఎలుకలు, కుక్కలు కోతులు కరిచిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతోనే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శ్రీ వర్షిత ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అసమర్ధ పాలనకు విద్యార్థుల జీవితాలు బలవుతున్నాయని అన్నారు. అనంతరం మృతురాలు వర్షిత కుటుంబానికి 50వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఆస్పత్రి నుండి శ్రీ వర్షిత మృతదేహాన్ని స్వయంగా ధర్నాకు మోసుకు వస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అడ్డుకుంటున్న పోలీసులు..



అంబేద్కర్ చౌరస్తాలో మృతదేహంతో ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వివరిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

ఫ్రీజర్ బాక్స్ లో శ్రీ వర్షిత మృతదేహాన్ని ఉంచుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి


మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్పుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





