Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం ప్రతాపవాడలోని శివాలయం పక్కన ఇంట్లో అనుమానస్పద స్థితిలో ఓ వృద్ధ మహిళ మృతి చెందిందని కాలనీవాసులు తెలిపారు. వారి కథనం ప్రకారం… పంపరి పద్మ(70) అనే వృద్ధురాలు తన కుమారుడు అజయ్ కుమార్ తో కలిసి శివాలయం పక్కన ఒక ఇంట్లో అద్దెకు నివసిస్తుంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండడంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, ఎస్ఐలు యూనస్ అలీ, రాధాకృష్ణ పోలీస్ సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో ఆమె రక్తపు మడుగులో ఉంది. ఆమె మృతి చెంది మూడు రోజులకు పైగా అయి వుంటుందని పోలీసుల అనుమానిస్తున్నారు. కాగా మృతురాలు కుమారుడు అజయ్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం అతడు కొన్ని రోజులుగా కనపడకుండా ఉండడంతో ఆమె మృతికి కారణం కుమారుడా..? లేక వేరేవారా..? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పోలీసులు వృద్ధురాలి మృతి పట్ల సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వృద్ధురాలి భర్త రిటైర్డ్ ఉద్యోగి కావడంతో అతని మరణాంతరం భార్యకు ఫించన్ వస్తుండడంతో కొడుకే డబ్బుల కోసం హత్య చేసి ఉండవచ్చని, అందుకే కొడుకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టవచ్చని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా పోలీసుల సమగ్ర విచారణలో వాస్తవం త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






