
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శుచి శుభ్రతకు మారుపేరు నటరాజ్ ఉడిపి హోటల్ గా నిలిచింది. మొదట ఉడుపి నుండి హుజురాబాద్ కు నటరాజ్ హోటల్” వచ్చి చేరింది. ఇప్పుడు దానికి ఏకంగా 42 వసంతాలు పూర్తి చేసుకుని ఒకే అడ్డలో కస్టమర్ల ఆదరణ చూరగుంటుంది. నాడు శెట్టి సోదరులు.. చాయ్ 10 పైసలు, పూరి 50 పైసలకు హెచ్ కొనసాగించగా నేడు క్రమక్రమంగా ఎంతో ప్రజాదారణ పొందుతుంది. దాని పుట్టు పూర్వోత్తరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా నుండి 1971లో శెట్టి సోదరులు కరీంనగర్ కు బతుకుదెరువుకు వచ్చిన కోర్గి రఘురామ్ శెట్టి, రాజీవ్ శెట్టి, లక్ష్మణ్ శెట్టి సోదరులు. శెట్టి సోదరులు మొదట కరీంనగర్ జిల్లా కోర్టు ముందు అప్పటి కృష్ణ భవన్ ఉడుపి హోటల్ లో బాయ్ గాపని చేసి ఆ అనుభవంతో 1983లో హుజురాబాద్ లో హోటల్ ను ప్రారంభించారు. హోటల్ నిర్వహణలో కొంత అనుభవం సంపాదించిన రఘురామ్ శెట్టి, రాజీవ్ శెట్టి సోదరులు అప్పటికి ఉడుపి హోటల్ లేని హుజూరాబాద్ లో ప్రారంభించాలని తద్వారా స్వయం ఉపాధి పొందాలని సంకల్పించారు. హుజురాబాద్ బస్టాండు వద్ద జమ్మికుంటరోడ్ లో బండ అంకూస్ (హుజురాబాద్ ఉప సర్పంచ్ గా నాడు పనిచేసారు) కు చెందిన శెట్టర్ కిరాయికి మాట్లాడుకుని 1983లో నాడు చిన్న ఉడిపి హోటల్ ప్రారంభించారు. రఘురామ్ శెట్టి, రాజీవ్ శెట్టి, లక్ష్మణ్ శెట్టి కలిసి హోటల్ ను కాలానుగుణంగా అభివృద్ధి చేసారు. 1983 నుండి ఇప్పటివరకు సుమారు 42 ఏళ్లపాటు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం గడుపుతున్నారు.


నాడు చాయ్ 10 పైసలు, పూరి 50 పైసలు
1983లో హోటల్ ప్రారంభించినప్పుడు చాయ్ రేటు 10 పైసలు, ప్లేట్ పూరి 50 పైసలు, ఎంతో రుచికరమైన టిఫిన్లు ఇడ్లి, వడ, పూరి, దోస, ఉప్మా, ఊతప్ప, ఆలు బిర్యానీ, మైసూర్ బజ్జి వంటివి ఇక్కడి కస్టమర్లకు అందించారు. వేసవిలో ఈ హోటల్ లో అందించే మజ్జిగ, దహి వడ కస్టమర్ల మనసు గెలుచుకుంది. మధ్యాహ్నం, సాయంత్రం భోజనంతో పాటు చపాతీ ఇక్కడ బాగుంటాయి. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆటుపోట్లు ఎదురైనా తాము నమ్ముకున్న హోటల్ ను, వృత్తిని గౌరవిస్తూ.. ఇప్పటికి జీవనం సాగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకు హోటల్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఇక్కడి కస్టమర్లకు నాణ్యమైన టిఫిన్లు, చాయ్, భోజనం అందిస్తున్నారు. ఎన్నో టిఫిన్ సెంటర్లు కొత్తగా వచ్చినప్పటికీ.. ఇప్పటికి ఆ పోటీని తట్టుకుని సవాళ్ళను అధిగమించి ఇంకా హోటల్ ను నడుపుతున్నారు. ఏళ్లకేళ్లుగా ఈ హోటల్ ను సందర్శిస్తున్న కస్టమర్లు ఉన్నారు.

మాది హుజురాబాదే..
కర్ణాటక నుండి ఇక్కడికి వలస వచ్చినప్పటికీ జీవన గమనంలో హుజురాబాద్ తో అనుబంధం పెనవేసుకుపోయింది. ఇప్పటికి వారు హుజురాబాద్ మా ఊరు అని చెప్తారు. ఉడుపి నుండి ఇక్కడికి ఈ హోటల్ లో పనిచేసేందుకు వచ్చిన వారు కూడా కొద్ది కాలం ఇక్కడ పనిచేసి ఆ అనుభవంతో ఇతర చోట్ల ఉడుపి హోటళ్లు పెట్టుకుని స్థిరపడ్డారు. శెట్టి సోదరులు కస్టమర్లతో ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటూ.. ఇక్కడి సంస్కృతిలో, జీవనంలో భాగమైపోయారు.

హుజురాబాద్ ఆదుకుంది : శెట్టి సోదరులు.
ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు వెలకట్టలేనివి. మేము మాకు 15 నుండి 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇక్కడి వచ్చాం.. ఇప్పుడు 60వ వడిలో పడ్డాం.. ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. హుజురాబాద్ మమ్మల్ని ఆడుకుంది. ప్రేమను చూపించింది. మాకు ఏనాడూ ఇక్కడ చిన్న ఇబ్బంది కూడా కాలేదు.. అని రఘురాం, రాజీవ్, లక్ష్మణ్ శెట్టి సోదరులు చెప్తారు. మా కుటుంబాలు ఇక్కడికి వలసవచ్చాయి. మా పిల్లలు ఇక్కడే పెరిగారు. ఇక్కడే చదువుకున్నారు. వారి వివాహాలు కూడా అయ్యాయి. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మాకు వీలున్నప్పుడు, బంధువుల శుభకార్యాలకు ఉడుపికి వెళతాం.. కరోనా లాంటి కష్టకాలంలోనూ, ఎన్నో సవాళ్లు ఎదురైనా హోటల్ ను నడిపించాం. 42 ఏళ్ళు అయినా ఒకే చోట హోటల్ నడిపిస్తున్నాం. వేలాది మంది కస్టమర్లు మా దగ్గర తమ ఆకలి తీర్చుకున్నారు. ఇది మాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. వారి ప్రేమానురాగాలు మరువలేనివి. నిజానికి ప్రస్తుతం వర్కర్ల కొరత సమస్య గా ఉంది. ఒక్కోసారి వర్కర్లు రాకపోయినా.. నామోషీ, సిగ్గు పడకుండా.. మేమే.. సప్లయర్లుగా మారతాం.. క్లీనర్లుగా పనిచేస్తాం.. మాకు పనే దైవం.. మేము కస్టమర్లకు ఆకలి తీరుస్తుంటే.. మాకు, మా కుటుంబాలకు అన్నం పెడుతున్నది మాత్రం కస్టమర్లే.. కస్టమర్లే మాకు దేవుళ్ళు.. మా పని పై శ్రద్ద పెడతాం.. మా సేవను మరింత మెరుగుపరుచునే ప్రయత్నం చేస్తాం.. శుచి, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తాం. ఆహార నాణ్యత, కూరగాయలు, సరుకుల నాణ్యత విషయంలో ఏనాడూ రాజీ పడలేదు.. అని చప్పుకొచ్చారు.. శెట్టి సోదరులు. ఇప్పటికి 42 సంవత్సరాలుగా వ్యాపారంలో ఉండి కూడా ఓ సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం. ఉడిపి హోటళ్లకు పెట్టిందే పేరుగా ప్రజలు నాటి నుండి నేటి వరకు ఆదరిస్తూనే ఉన్నారు, నిర్వాహకులు ఆదరించేలా వ్యవహరిస్తున్నారు. అందుకే నటరాజ్ ఉడిపి హోటల్ కు ఎంతో ఘనమైన చరిత్ర లిఖించుకుంది.


నాణ్యతతో కూడిన ఆహార ప్రాంతాలు తయారు చేస్తుండగా, ఆదరిస్తున్న కస్టమర్లు..

రఘురాంశెట్టి
ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు వెలకట్టలేనివి. మేము మాకు 15 నుండి 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇక్కడి వచ్చాం.. ఇప్పుడు 60వ వడిలో పడ్డాం.. ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. హుజురాబాద్ మమ్మల్ని ఆడుకుంది. ప్రేమను చూపించింది. మాకు ఏనాడూ ఇక్కడ చిన్న ఇబ్బంది కూడా కాలేదు.. అని రఘురాం, రాజీవ్, లక్ష్మణ్ శెట్టి సోదరులు చెప్తారు

రాజీవ్ శెట్టి
మా అన్నగారు నెలకొల్పిన ఈ ఉడిపి హోటల్ నేడు ఆయన మాకు అప్పగించి వెళ్ళగా నాటి నుండి నేటి వరకు అదే ఆదరణ చూపెడుతున్న కస్టమర్లకు సర్వదా కృతజ్ఞతలు.

లక్ష్మణ్ శెట్టి
ఏనాడు మేము ఓనర్లము, వర్కర్లే పని చేయాలని చూడలేదు. అందరం కలిసికట్టుగా ఏ పనైనా చేయడం మాకు అలవాటు. అందుకే కస్టమర్లకు సకాలంలో సేవలందిస్తూ ఆదరణ చూర కొంటున్నాము.





