Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మానవ సేవే మాధవ సేవగా భావించే రామోజీ గ్రూపుల వ్యవస్థాపకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామిక వేత్త కీ. శే. చెరుకూరి రామోజీరావు తెలుగు ప్రజలతో పాటు యావద్భారతావనికి అనేక రంగాల్లో చేసిన సేవలు చిరస్మరణీయం అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
రామోజీ జయంతి, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో రామారావు పాల్గొని రామోజీ చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
నిఖార్సయిన పాత్రికేయుడైన రామోజీ, విలువలతో కూడిన జర్నలిజం, దార్శనికత, క్రమశిక్షణ, సంకల్పం సేవాభావం గల లక్షణాలతో శాస్త్రీయ దృక్పథం కలిగిన నిత్యాన్వేషకుడిగా యువకుడిగా దూకుడు స్వభావం కలిగి తెలుగు భాషా వికాసానికి, గ్రామీణ భారతావనికి అనునిత్యం రామోజీ పరితపించే వారన్నారు. ఈనాడు పత్రిక, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీల ద్వారా అనేక రంగాల్లో అందించిన సేవలు, లక్షలాది మందికి ఉపాధి కల్పించడం భేష్ అని, రామోజీ సేవలను పోలాడి రామారావు కొనియాడారు.
ఆకస్మిక ప్రకృతి వైపరీత్యాల తుఫానులు వరదలతో అతలాకుతలమైన తెలుగు, గుజరాత్ ప్రజలతో సహా పక్క రాష్ట్రాల ప్రజలకు శాశ్వత గృహాలు, తుఫాన్ షెల్టర్లు, పాఠశాల భవనాలు, అనాథఆశ్రమాలు నిర్మించారని, బాధితులకు ఆపత్కాలంలో లక్షలాది ఆహార పొట్లాలు అందించారని అన్నారు.
రైతే రాజుగా భావించి అన్నదాత, జై కిసాన్ లాంటి ప్రసారాల ద్వారా రైతులకు ఎంతో సేవలు అందించారని, మద్యపాన నిషేధం కోసం కృషి చేశారని అన్నారు. అలాగే మహిళా సాధికారత కోసం పాటు పడ్డారని, ప్రతి ఘటన, మౌన పోరాటం, మయూరి, అశ్విని, నువ్వే కావాలి లాంటి సందేశాత్మక సినిమాలు అందించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాన్యుల హక్కుల కోసం పాటుపడ్డారన్నారు.
రామోజీ జయంతి రోజే జాతీయ పత్రికా దినోత్సవం కావడం విశేషమని, రామోజీ జయంతిని ఫౌండేషన్ డే గా రామోజీ గ్రూపుల యాజమాన్యం జరపడం అభినందనీయం అని పోలాడి రామారావు పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా నిస్వార్థంగా వివిధ మాధ్యమాల ద్వారా తెలియ జేస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.






