
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి మనిషికి కూడు, గూడు, నీడ కల్పించడమే కాంగ్రెస్ ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి నిరుపేదలకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ పేర్కొన్నారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదవారి కలల్ని నిజం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దే అని పేర్కొన్నారు.సొంతింటి కల ప్రతి పేద కుటుంబ జీవిత లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నెరవేర్చుతోందన్నారు. అర్హులైన ప్రతీ పేదవారికి విడతల వారీగా ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇంటి కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన పేదవారి సంతోషం తీరని ఆనందమని పేర్కొన్నారు.“కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోళ్ల ప్రభుత్వం. పేదవారి పక్షాన నిలబడేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు మేము ఉన్నాం” అని ప్రణవ్ అన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన పేద కుటుంబాలకు మరిన్ని ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రణవ్ కు బొట్టు పెట్టి శాలువాతో సత్కరిస్తున్న గృహ నిర్మాణదారులు..





