
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
అగ్రవర్ణాల దోపిడీకి గురవుతున్న బీసీలను ఐక్యం చేసి వారి వాటాను సాధించుకునే విధంగా ఐక్య పోరాటం చేస్తామని ప్రజాస్వామిక బీసీల ఉద్యమ వేదిక అడహాక్ కమిటీ కన్వీనర్ సాదుల రవీందర్ బాబు అన్నారు. ఆదివారం హుజురాబాద్ లో బీసీల వాటా సాధన కోసం ప్రజాసంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీలను అగ్రవర్ణాలు రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేసారని బీసీలు చైతన్యవంతులు కాకుండా చూశారని అన్నారు. కానీ నాలుగు దశాబ్దాలుగా జరిగిన అగ్రవర్ణాల మోసాలను గ్రహించిన బీసీలు మేల్కొని తమ వాటా కోసం ఐక్య పోరాటానికి సిద్ధమయ్యారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తా మని అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని మోసం చేశాయని పేర్కొన్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం బీసీలకు 17 శాతం మాత్రమే సీట్లు ఇవ్వడం ద్వారా బీసీలు మోసపోయారని అన్నారు. అగ్రవర్ణాలు ప్రభుత్వ వర్గాలు రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాలను గ్రహిస్తున్న బీసీలు తమ వాటా సాధన కోసం ముందుకు వచ్చాయని అందుకే ఐక్యంగా వాటా సాధన కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించినందున దానిని భర్తీ చేయడం కోసం జనరల్ స్థానాల్లో కూడా బీసీలను నిలబెట్టి గెలిపించుకోవాలని అన్నారు. ఇంతకాలం జనరల్ స్థానాలన్నీ ఓసీలకు మాత్రమే అనే ఆలోచనలో బీసీలు అగ్రవర్ణాలు ఉండేవని కానీ మారుతున్న కాలంలో జనరల్ స్థానంలో బీసీలను నిలబెట్టి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ దశగా బీసీలను చైతన్యవంతపరిచి జనరల్ స్థానాల్లో నామినేషన్లు వేయించి గెలిపించుకుంటామని అన్నారు. బీసీల వాటా సాధన కోసం పోరాటంలో బాగా పాలుపంచుకునే ఇతర బడుగు బలహీన వర్గాల నాయకులు సైతం ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరారు. అందరిని కలుపుకొని బీసీల వాటా సాధన చేస్తామని ఆయన అన్నారు. దీనికోసం హుజురాబాద్ లో మరొక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు భీమోజు సదానందం, కొలిపాక సారయ్య, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, డాక్టర్ శేఖర్, గోస్కుల ముత్యంరాజు, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రజాస్వామిక బీసీల ఉద్యమ వేదిక అడహాక్ కమిటీ కన్వీనర్ సాదుల రవీందర్ బాబు





