
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం హుజురాబాద్ మండలంలో ప్రశాంతంగా జరిగాయి. హుజురాబాద్ మండలంలో 20 గ్రామాలు ఉండగా సర్పంచి పదవి కోసం 81 మంది పోటీపడ్డారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. మొదటి రెండు గంటల్లో కేవలం 20.87 శాతం మాత్రమే పోలయ్యాయి. 11 గంటల సమయంలో 58.51 శాతం ఓట్లు పోలవగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 85.94 శాతం పోలింగ్ నమోదయింది. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్ చివరి వరకు భారీగా నమోదయింది. మండలంలో మొత్తం ఓటర్లు 35,943 మంది ఉండగా వారిలో 30,891 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పురుషుల కన్నా మండలంలో మహిళలే ఎక్కువగా ఓటు వేశారు. ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసింది. హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో జరిగే ఓటింగ్‌ను సిపి గౌస్ అలం సందర్శించి పరిశీలించారు. తుమ్మనపల్లి లో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సందర్శించి పరిశీలించారు. చెల్పూర్ లో ఓటింగ్ కోసం భారీ సంఖ్యలో ప్రజలు నిల్చుని ఓటు వేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు కావడంతో యువకులు, వృద్ధులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే వి సతీష్ బాబు, మాజీ ఎంపీపీ సరోజినీ దేవి, ఇంద్రనీల్, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, వి శ్రీనివాసరావు, వి కిషన్ బాబు, సిర్సపల్లి లో సబ్బని వెంకట్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు..

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, వారి కుటుంబ సభ్యులు..

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్ ఆయన కుటుంబ సభ్యులు..

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ పమేలా సత్పతి






ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన దివ్యాంగ వృద్ధులు….

ఓటింగ్ సందర్భంగా వీధుల్లో ఓటర్లతో కోలాహలం..





