
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతాల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేయించడానికి సీఎం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం హుజురాబాద్ మండలం సిర్షపల్లి గ్రామంలో సామాజికవేత్త సబ్బని వెంకట్ గృహంలో డంపింగ్ యార్డ్ పై విలేకరులతో ఆయన మాట్లాడుతూ…. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు సరికాదని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితిలు, నీరు, పర్యావరణం దెబ్బతింటుందన్న ప్రజల భయాందోళనను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పార్టును ప్రజలు వ్యతిరేకిస్తున్నందున ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా, పరిసరాల పరిరక్షణ దృష్ట్యా డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకునే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను సైతం తాను సందర్శించాలని డంపింగ్ యార్డుల వల్ల ఎంత నష్టం ఉందో తనకు తెలుసని హుజురాబాద్ పరిసర ప్రాంతాల రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తానని అన్నారు. సామాజికవేత్త సబ్బని వెంకట్ డంపింగ్ యార్డ్ సమస్యను తన దృష్టికి తీసుకొని వచ్చారని తప్పనిసరిగా ఈ విషయంపై తన వంతు సహాయం చేస్తానని అన్నారు. న్యాయవాది ముక్కెర రాజు మాట్లాడుతూ… డంపింగ్ యార్డ్ కోసం వేస్తున్న టెండర్లను కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడంలేదని అన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ప్రజల జీవితానికి ఇబ్బంది అని అన్నారు. సామాజికవేత్త సబ్బని వెంకట్ మాట్లాడుతూ…. డంపింగ్ యార్డ్ వల్ల కొంతమంది తమ భూముల ధరలు తగ్గుతున్నాయని అపోహ పడుతున్నారని కానీ డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో వాతావరణ కాలుష్యం ఏర్పడడమే కాకుండా వ్యాధులు ప్రభలు తాయని అన్నారు. పర్యావరణం మీద పూర్తిగా ప్రభావం పడి ఈ ప్రాంతంలోని నీటి వనరులు కాలుష్యం బారిన పడతాయని, డంపింగ్ యార్డ్ లో చెత్తను కాల్చడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాయువులు రావడం వల్ల వాతావరణం కలుషితమైపోతుందని దీనిని పీల్చడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలోనే అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల జీవనానికి మరణ శాసనం రాసే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ప్రభుత్వం పూర్తిగా విరమించుకునే వరకు పోరాటం చేస్తానని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రైతులతో కలిసి అఖిలపక్షంగా ఏర్పడి డంపింగ్ యార్డ్ సమస్యను ఉదృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని ఆయన అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం.. పక్కన సామాజికవేత్త సబ్బని వెంకట్, ముక్కెర రాజు తదితరులు..






