
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతూ, ప్రజాతంత్రంగా అందించినప్పుడే సమాజంలో అనుకున్న మార్పులు వస్తాయని, అదే విద్యారంగం ప్రైవేటీకరిస్తే సమాజంలో తిరోగమన మార్పులు వస్తాయని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్, సీనియర్ ఉద్యమ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సు మరియు అభినందన సభ డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవాల నరహరి, చకినాల రామ్మోహన్ ల అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ నేడు విద్యారంగం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని ప్రభుత్వ విద్యారంగం రోజురోజుకు కుచించుకుపోతుంటే, ప్రైవేటు కార్పోరేట్ విద్యారంగం రోజురోజుకు విస్తరిస్తున్నదన్నారు. ఈ మార్పు సమాజానికి మంచిది కాదన్నారు. గత ప్రభుత్వం తుమ్మిడి హెట్టు వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాలేశ్వరం వద్ద నిర్మించి లక్షలాది కోట్ల నిధులు వెచ్చించి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కారణంగానే నేటి ప్రభుత్వం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించలేని స్థితి నేడు నెలకొన్నది అన్నారు. ఈశ్వర్ రెడ్డి కేవలం ఉపాధ్యాయునిగానే పనిచేస్తే ఇంతమంది ఈ సభకు హాజరయ్యేవారు కాదని, అతడు విద్యారంగం తో పాటు సమాజం మార్పుకోసం, తెలంగాణ కోసం పాటుపడిన ఉద్యమకారుడు కాబట్టే ఇంత మంది హాజరయ్యారు అన్నారు.

సదస్సుకు ప్రధాన వక్తగా హాజరైన వీక్షణం సంపాదకులు ఎన్ .వేణుగోపాల్ తెలంగాణ రైసింగ్ – 2047- విద్యారంగం అన్న అంశంపై మాట్లాడుతూ ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన గ్లోబల్ సబ్మిట్ సందర్భంగా తెరమీదికి వచ్చిన తెలంగాణ రైసింగ్ – 2047లో విద్యారంగానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని చెప్పబడుతున్నప్పటికీ వాస్తవంగా అందులో వేలకోట్ల రూపాయలు కూడా రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మౌలిక సమస్యల గురించి ఆలోచించకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాపార దృక్పథంతో చూసే విధానాలు అవలంబిస్తున్నదన్నారు. ఈ కారణంగానే వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం, ప్రజల ఆస్తులు పెట్టుబడిదారుల పరం చేయబడుతున్నాయన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2020 పేరు మీద అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా నేటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ప్రజల్ని భ్రమల్లో ముంచేత్తేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.దీని ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా వాటి పాలకవర్గ స్వభావంలో మార్పు ఏమి ఉండదని, అవి ఎప్పుడు కూడా ప్రజలందరికీ ఉపయోగపడే నిజమైన విద్య, ప్రజాతంత్ర విద్య అందించవని ఎందుకంటే విద్య ద్వారా ప్రశ్నించే స్వభావం వస్తుందనే భయం పాలకులకు ఎప్పుడూ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్తను చాన్సలర్ గా చేయడంలోనే ప్రభుత్వ విద్యపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతున్నదన్నారు. విద్యా రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రయోజనం శూన్యం అన్నారు.
డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అనేక ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పేరుకుపోబడి ఉన్నాయని, గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నది తప్ప సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదన్నారు. విద్యారంగాన్ని పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు తన బాధ్యత నుంచి తప్పించుకొని నేడు ప్రైవేటు, వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విద్యా విధానాన్ని ముందుకు తీసుకు పోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇదే రీతిలో సాచివేత ధోరణి ప్రదర్శిస్తే ఉపాధ్యాయులను ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అభినందన సమావేశంకు హాజరైన వక్తలు మాట్లాడుతూ ఈశ్వర్ రెడ్డి హుజురాబాద్ ప్రాంతంలో ఉపాధ్యాయ విద్యారంగ ఉద్యమంలోనే కాకుండా తెలంగాణ ఉద్యమంలో, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర వారికి ఉన్నదన్నారు. వారు ఉద్యోగ విరమణ తర్వాత కూడా విద్యారంగ, సామాజిక ఉద్యమాలలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమాల ఉపాధ్యాయుడు పలకల ఈశ్వర్ రెడ్డి అనే ప్రత్యేక సంచికను జన సాహితీ హుజురాబాద్ సంస్థ ఆవునూరి సమ్మయ్య ఆధ్వర్యంలో, ప్రొఫెసర్ ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
ఈ సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్, హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కే. సమ్మయ్య, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు బి.శ్యామ్, అటుకుల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కవ్వ లక్ష్మారెడ్డి, కె నారాయణరెడ్డి, ఎం రఘుశంకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కే. చంద్రమౌళి, ఏ.సంజీవరెడ్డి, డి.ఏసు రెడ్డి, బి సదానందం, తూముల తిరుపతి, విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు వేల్పుల రత్నం, జన సాహితీ నాయకులు రవిశంకర్ శుక్ల, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ గోవిందరావు, ఏ తిరుపతి, జి ఆదిరెడ్డి, వి.తిరుపతి, తంగెళ్ల సుదర్శనం, ఏ రాజేశ్వరరావు, డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా నాయకులు శ్రీరామ్ చక్రధర్, ఏబూసి శ్రీనివాస్, ఎం.సదానందం, దామోదర్, జయప్రద గౌతమి, రామ్ కిరణ్, టి తిరుపతి, మండల నాయకులు బండ శ్రీనివాస్, బేతి తిరుపతిరెడ్డి, సార్ల సంపత్, చిటికెన వేణు, అల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



హాజరైన వివిధ సంఘాల నాయకులు, విద్యా అభిమానులు…





