
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సిద్దిపేట): జనవరి 11న హన్మకొండలో లక్ష మందితో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి సభను విజయవంతం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐలినేని మల్లిఖార్జున రెడ్డి పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సిద్ధిపేటలో జిల్లా స్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించగా, వివిధ సామాజిక వర్గాల నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలాడి రామారావు మాట్లాడుతూ, ఓసిలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసి విద్యార్థులకు టెట్ అర్హత మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయో పరిమితి పెంచాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను ఎలాంటి షరతులు లేకుండా ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయాలని కోరారు.
ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులను అదే వర్గంతో వెంటనే భర్తీ చేయాలని, సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం జనవరి 11న నిర్వహించే ఓసిల సింహగర్జన సభకు అన్ని ఓసి సామాజిక వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఐకాస నాయకులు కోరారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐలినేని మల్లికార్జునరెడ్డి, రెడ్డి ఐకాస జిల్లా ప్రధాన కార్యదర్శి పన్యాల విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా ఐకాస వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్రి ఉమారెడ్డి, గంప కృష్ణమూర్తి, చకిలం రవి, చింతా రాజేంద్ర ప్రసాద్, అయితా రాజేశం, కర్నె సంతోష్ రెడ్డి, వంగ శైలజ, జూలూరి శ్రీనివాస్, గౌరిషెట్టి దామోదర్, శ్రీనివాస్ రావు తదితరులతో పాటు వివిధ మండలాల ఐకాస నాయకులు పాల్గొన్నారు.

జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన భారీ బహిరంగ సభ విజయవంతానికి ఏర్పాట్ల గురించి ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సిద్ధిపేట జిల్లా స్థాయి ఓసి జేఏసీ నాయకుల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐలినేని మల్లిఖార్జున రెడ్డి.



ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐలినేని మల్లిఖార్జున రెడ్డి తదితరులు..





