
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీలోని 30వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ భీమగోని సురేష్ శనివారం బిఆర్ఎస్ లో చేరారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సురేష్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన గత ఉప ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ కు మద్దతుగా బిజెపిలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో చాలామంది ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. బిజెపి సైతం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదని అందుకే బిజెపిపై సైతం కోపంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడేది గులాబీ పార్టీ అని ప్రజలు గ్రహించారని అన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టిగా అండగా నిలుస్తారని అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందేనని, అదే విధంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమ్మకంతో తిరిగి పార్టీలో చేరానని భీమగోని సురేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ కల్లేపల్లి రమాదేవి, బిఆర్ఎస్ నాయకులు దిల్ శ్రీనివాస్, పూసల ప్రభావతిరెడ్డి, రాజకుమార్, భూసారపూ వెంకటేశ్వర్లు, విక్కీ, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


మాజీ కౌన్సిలర్ భీమగోని సురేష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..






