
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు రిజర్వేషన్ల లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు, ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని పలువురు ఓసి ఐకాస జాతీయ, రాష్ట్ర నాయకులు అన్నారు.
మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓసి ఐకాస రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర జాతీయస్థాయి నాయకులతో పాటు వివిధ జిల్లాల ఐకాస నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రేసిడెంట్ తాడిశెట్టి పశుపతిలు మాట్లాడుతూ..రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక, అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని విచారం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసిలకు నేటికీ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. మున్సిపల్ రిజర్వేషన్లలో ఓసిలను అణగ దొక్కాలనే పాలకుల బ్యూరో క్రాట్ల కుట్ర స్పష్టంగా బయట పడిందన్నారు. ఓసిల జనాభా 80 శాతం ఉన్న వార్డుల, డివిజన్లుఎస్సీ ఎస్టీ, బీసీలకు రిజర్వు కాగా, ఎస్సీ ఎస్టీ బీసీలు 79 నుంచి 88 శాతం ఉన్న ప్రాంతాలను జనరల్ కేటగిరీలో చేర్చడం పాలకుల బ్యూరో క్రాట్ల కుట్రకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం జనరల్ కేటగిరీకి రిజర్వు చేయబడిన స్థానాల్లో ఓసీయేతరులు 80 శాతం ఉండటంతో ఓసిలు అక్కడ గెలుపొందే పరిస్థితి లేదన్నారు. శాస్త్రీయంగా లేని రిజర్వేషన్ల మార్పుపై తక్షణమే ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓసిలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం తథ్యమని నాయకులు హెచ్చరించారు. జనరల్ స్థానాల్లో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీ యేతరులకు కొన్ని రాజకీయ పార్టీలు టికెట్ల ఇచ్చి ఓసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఇదే విధమైన విధానాలు అనుసరించడం వల్ల ఓసిలు సర్పంచ్ అవకాశాలు కోల్పోయారని వెల్లడించారు. తాము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్ధానిక ఎన్నికల్లో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
,ఈడబ్ల్యూఎస్ పై కుట్రలు సాగనివ్వం……..
రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, కొందరు తమలబ్దికోసం చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పోలాడి రామారావు, నల్ల సంజీవ్ రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, తాడిశెట్టి పశుపతి డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని విరుచుకుపడ్డారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలన్నారు. ప్రస్తుతమున్న 59శాతం దాటని రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తింప చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసిల మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా ఓసి సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని సమావేశంలో పాల్గొన్న ఓసి సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, నల్ల సంజీవ్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఫిబ్రవరి 23న డిల్లి మహాధర్నాకు సంబందించి గోడ ప్రతులను కర పత్రాలను నాయకులు ఆవిష్కరించారు. అంతకు ముందు మాజీ మంత్రి మల్కాజీగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ను, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డిని హైదరాబాద్ లోని నివాసంలో నాయకులతో కలిసి పోలాడి రామారావు ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ఓసిల జాతీయస్థాయి మహా ధర్నా కార్యక్రమం ఏర్పాట్ల గురించి వివరించి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను అందించి వారిచే గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్ క్లబ్ ముందు ఎదురుపడ్డ బీసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ఎంపి ఆర్ కృష్ణయ్యకు ఆహ్వాన పత్రిక అందజేసి మద్దతు ఇవ్వాలని రామారావు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐకాస జాతీయ అధ్యక్షుడు, జాతీయ చైర్మన్ పోలాడి రామారావు, నల్ల సంజీవ్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతిలతో పాటు నాయకులు దనేకుల రాంబాబు, లెంకలపల్లి సోమయ్యగుప్త, కోల్పూర్ రమేష్, నాచం ప్రభాకర్, మహేశ్ పాటు ఓసి ఐకాస రాష్ట్ర, వివిధ జిల్లాల ఐకాస అధ్యక్ష కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.


ఈటలను సన్మానించిన అనంతరం మహాధర్న కరపత్రాలను, వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్..

మహాధర్నా కరపత్రాన్ని ఆర్ కృష్ణయ్యకు అందజేసి ఆహ్వానిస్తున్న పోలాడి రామారావు..

మాజీమంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఆహ్వాన పత్రాన్ని అందజేసి ఆహ్వానిస్తున్న పోలాడి రామారావు..

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు, నాయకులు..

మహా ధర్నా వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు రామారావు, నాయకులు..





