
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హైదరాబాద్): అన్న దాతలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
కేంద్ర రాష్ట్ర రైతు ప్రభుత్వాలు రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న పాలకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అలక్ష్యం చేయడమేందుకని రామారావు ప్రశ్నించారు. ముఖ్యంగారైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల లో ఎందుకు జాప్యం చేస్తోంది అని నిలదీశారు. రైతు భరోసా నిధుల కోసం సమీకరించిన 9 వేల కోట్ల రూపాయల లోంచి 4 వేల రూపాయలను కమిషన్ లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.
పంట పెట్టుబడి సహాయం కోసం ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని మరో 15 రోజుల్లో అట్టి పంటలు కోతకు వస్తున్నాయని ఇంకెప్పుడు నిధులు విడుదల చేస్తారని రామారావు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభమయ్యే 16 వ తేదీలోగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీనీ ముట్టడిస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు.
రైతులు, కూలీలు, యువత, మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పంటలకు నీళ్ళు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా యువతకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. మధ్యతరగతి ప్రజలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రాజెక్టు నుండి ఏ విధంగా నీళ్ళు తీసుకు వచ్చి ఏ విధంగా ఇబ్బందులు తొలగించవచ్చో వాటర్ మేనేజ్ మెంట్ చేయవచ్చో కనీస సోయి కూడా రాష్ట్ర పాలకులకు లేకపోవడం దారుణం అని అన్నారు. పొరుగు రాష్ట్ర సిఎం చంద్రబాబు నాయుడు వాటర్ మేనేజ్ మెంట్ చేయడం లో దిట్ట అని అక్కడి పని తీరును మన పాలకులు చూసి నేర్చుకోవాలని అధికారులను పంపి స్టడీ చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల డిమాండ్లు పరిష్కరించాలని, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఏప్రిల్ 28న ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో లక్ష మందితో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ నిర్వహించనున్నట్లు పోలాడి ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రైతు మహాగర్జనకు సంబంధించి ఐకాస రాష్ట్ర, వివిధ జిల్లాల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం, పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు.

ఈ సందర్భంగా సమావేశ వివరాలను రామారావు మీడియా కు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ రైతుల పంటల పై ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టుబాటు ధరలు అన్న దాతలకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని రైతులు పండించిన పంటలకు రైతులే గిట్టు బాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత పెరుగుతోందని, ఖర్చులు బాగా పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతుల వ్యవసాయరంగానికి చేయూత నిచేందుకు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపితం చెయ్యాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని తక్షణమే అనుసంధానం చేయాలన్నారు.
రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన రైతులకు నెలకు కనీసం 6వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతుల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 20లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, వివిధ ఓసి కార్పొరేషన్ల నామ మాత్రంగానే ప్రకటించిన పాలకులు నిధులు, పాలకమండల్లను నేటికీ ఏర్పాటు చేయలేదని తక్షణమే ఆయా కార్పొరేషన్ లకు నిధులు విడుదల చేసి పాలకమండల్లులను ఏర్పాటు చేయాలని,
ఆర్ధికంగా వెనుకబడిన ఆగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లో నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభ ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకు వస్తామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
పార్టీల కతీతంగా అందరినీ సభకు ఆహ్వానిస్తామని అన్ని జిల్లాలనుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారే సంఖ్యలో తరలి వచ్చేలా చూస్తామన్నారు , రాష్ట్రమ్ లో ప్రతి పక్షాల పాత్ర నామ మాత్రంగానే ఉన్నందున రైతు, ప్రజాసంఘాల తరపున తామే ఆ బాధ్యత తీసుకొని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అడుగడుగునా పాలకుల వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ అలుపెరుగని పోరాటాలను రాజకీయాల కతీతంగా చేస్తామని రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుమిత్ర ప్రజాసంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, ఆర్య వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, వెలమ సంఘం జేఏసీ కన్వీనర్ జనగామ కరుణాకర్ రావు, నాయకులు కొట్టేపు మధుసూదన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కుమారస్వామి, నర్సయ్య, వివిధ జిల్లాల ఐకాస, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..



రైతు మహాగర్జనకు సంబంధించి ఐకాస రాష్ట్ర, వివిధ జిల్లాల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం, పోస్టర్ ఆవిష్కతీస్తున్న రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





