
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు రాజకీయ పార్టీలకతీతంగా అత్యంత ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఏసిపి మాధవి, మునిసిపల్ చైర్ పర్సన్ సుహాసిని, జయంతోత్సవ కమిటీ చైర్మన్ సురేందర్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.



ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రమేష్‌బాబు, పురపాలక కార్యాలయంలో కమిషనర్ ముసాబ్ అహ్మద్ జెండా ఆవిష్కరణ చేసి బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపో ఆవరణలో డిపో మేనేజర్ రవీంద్రనాథ్, ఆర్టీసీ సంఘాల నాయకులు నివాళులర్పించగా, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజ్యాంగ విలువలను చాటిచెప్పారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి
నివాళులర్పిస్తున్న చైర్పర్సన్ సుహాసిని..




ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్న అతిథులు..

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..

అతిథిగా వచ్చిన ఎసిపి మాధవిని శాలువతో సత్కరించి జ్ఞాపకం చేస్తున్న ఇతర అతిథులు, జయంతోత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ సురేందర్..
సమానత్వమే రాజ్యాంగ సారాంశం..
అంబేద్కర్ జయంత్యుత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మున్సిపల్ ఛైర్పర్సన్ రొంటాల సుహాసిని, బహుజన ఉద్యమ నేత వీజీఆర్ నారగోని, వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఆనందకిశోర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. “దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో జీవించాలన్నదే అంబేద్కర్ కల. ఆ లక్ష్యంతోనే ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించారు” అని వారు కొనియాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని స్పష్టం చేశారు.
పల్లె పల్లెనా జయంతి ఉత్సాహం..
కేవలం పట్టణంలోనే కాకుండా మండలంలోని పల్లెపల్లెనా అంబేద్కర్ నామం మారుమోగింది. అంబేద్కర్ నగర్, చెల్పూరు, శాలపల్లి, పోతిరెడ్డిపేట, ధర్మరాజుపల్లి, కందుగుల, కనుకులగిద్ద, జూపాక, కాట్రపల్లి, పెద్దపాపయ్యపల్లి, దమ్మక్కపేట, సింగాపూర్, ఇప్పల్ నర్సింగాపూర్, బోర్నపల్లి తదితర గ్రామాల్లో దళిత సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి.

అవగాహన కార్యక్రమాలు.
ఇదే సందర్భంలో పోలీస్ మరియు రవాణా శాఖల ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఏసీపీ వి.మాధవి, ఎంవీఐ కంచి వేణు, పట్టణ సీఐ టి.కరుణాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపేలా ‘అవేర్ అండ్ అలైవ్’ (Aware & Alive) కార్యక్రమాన్ని చేపట్టారు. చట్టాల పట్ల, సామాజిక బాధ్యతల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





