
— ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఎంపీ లు నోరు తెరువాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంపై అవగాహన లేకుండా తప్పుడు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమని తెలంగాణ జన సమితి (టి.జే.ఎస్) మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి అన్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు ప్రజల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు.
భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, దానిపై అపోహలు కలిగించే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది తెలంగాణ ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితమని గుర్తుచేశారు. అలాంటి చారిత్రాత్మక ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అలాగే, పార్లమెంట్లో ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ వాటిని కేంద్రం ఖండించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. గతంలో సుష్మా స్వరాజ్, ఎం వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుత బీజేపీ నాయకులు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ అంశం తెలంగాణ బీజేపీ ఎంపీలు నోరు తెరవకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అంశంపై స్పందిస్తూ, జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అరికిల్ల స్రవంతి కోరారు.

తెలంగాణ జన సమితి (టి.జే.ఎస్) మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి





