
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు దాన్యపు విక్రయించుకునే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, కొనుగోలు కేంద్రాలకు కుప్పలు తెప్పలుగా దాన్యం వస్తున్నా ఇంకా ఎందుకు కొనుగోళ్లు మొదలు పెట్టడం లేదని రైతులను ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.

ఆదివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డును రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి పోలాడి రామారావు సందర్శించి రైతులతో మాట్లాడి దాన్యపు కొనుగోళ్ళలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఆదివారం కురిసిన అకాల వర్షానికి తడిసిన దాన్యాన్ని పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చి ఓదార్చారు. ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ


దాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంబించి 10 రోజులు దాతుతున్నా, 10 రోజుల నుంచి కొనుగోళ్లు మాత్రం జరపడం లేదన్నారు.దీంతో అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పగలు రాత్రి కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నేడు కురిసిన వర్షానికి దాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతుల ఆక్రందనలు మిన్నంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తడిసిన దాన్యాన్ని ఎలాంటి కోతలు విధించకుండా మద్దతు ధరతో తక్షణమే కొనుగోలు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. రైతులకు కనీసం టార్పాలీన్ షీట్ కవర్లు, గన్నీ బ్యాగులు సరఫరా చేయడం లేదని దీంతో ప్రైవేట్ దళారులకు రైతులు తక్కువ ధరకు దాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఇందుకు ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ వ్యక్తుల మధ్య కుదిరిన బేర సారాల లోపాయికారీ ఒప్పందమేనని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల కొనుగోళ్లలో ఏ గ్రేడ్ కు 2389 మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా సాదారణ రకం మద్దతు ధరగా 2369 రేట్ కు ఇస్తేనే దించుకుంటామని మిల్లర్లు మొండికేస్తున్నారని లేదంటే ట్రాక్టర్ లను వెనక్కి తీసుకెళ్ళాలని బెదిరుస్తున్నారని మండి పడ్డారు. క్వింటాల్ కు 20 రూపాయలు కట్ చేయడంతో పాటు,తాలు మట్టి లేని, ఆరబెట్టి ఎండిన సూకా దాన్యానికి తూకం సమయంలో ఐదు కిలోల దాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని, మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తీస్తూ రైతుల శ్రమను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, అధినేతలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే అధికార ప్రజా ప్రతినిధులు ఎక్కడున్నారని పోలాడి రామారావు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. హమాళీలు లేరని మిల్లుల వారు తీసుకోవడం లేదని సాకులు చెబుతూ ఇప్పటికే 60 శాతం దాన్యం ప్రైవేట్ వ్యక్తుల పాలు చేశారన్నారు. సన్న రకాలకు ఇస్తున్న 500 రూపాయల బోనస్ ఎగొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. కావాలనే ప్రైవేట్ వాళ్లకు లబ్ది చేసేందుకే ఆలస్యంగా దాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాన్యపు కొనుగోళ్లు జరపడం లేదన్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగొట్టిన ప్రభుత్వం,సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ఇప్పుడు పంటల కోత సమయంలో అర కొరగా విడతల వారీగా ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ను వెంటనే దాన్యపు డబ్బులతో పాటే ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇఛ్చిన మాట ప్రకారం ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో తక్షణమే దాన్యపు కొనుగోళ్లను జరపాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. పొద్దు తిరుగుడు, శనగ, మొక్క జొన్న రైతులు కూడా పడి కాపులు కాస్తున్నారని వారి దాన్యాన్ని తక్షణమే మద్దతు ధరతో క్కనుగోళ్లు జరపాలని లేకుంటే రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం చేస్తామని పోలాడి పేర్కొన్నారు.


వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదారుస్తున్న రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

రైతుల పంటలు, వరి కోతలు పూర్తి కాక పోవడంతో రైతులుకు రావడం ఇబ్బంది అవుతుందని భావించి వివిధ వర్గాలు విద్యార్థుల విన్నపం మేరకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో రైతుల మహాగర్జన సమర భేరి సభను మే 30వ తేదీకి మార్చినట్లు పోలాడి రామారావు తెలిపారు. మే 30న రెండు లక్షల మందితో రైతుల మహాగర్జన సభను పార్టీల కతీతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్దన్, ఇరుపెండ్ల లింగారెడ్డి, కొత్తకొండ ఆంజనేయులు, మారుపాక రాజు, తిప్పర్ల తిరుపతి, గౌరవేణి రాజులతో పాటు అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల, గ్రామాల పలువురు రైతులు పాల్గొన్నారు.





