
–డిమాండ్ల సాధనకై 30న కరీంనగర్ లో రైతు మహా గర్జన
–కేంద్రమంత్రి బండి సంజయ్ ని ఆహ్వానించిన రైతు ఐకాస…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాష్ట్రంలో మొక్కజొన్న, వరి దాన్యం కొనుగోళ్ళు, తరలింపు ప్రక్రియలో ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, డిమాండ్ల సాధనకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న కరీంనగర్ లో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్త రైతు మహాగర్జన సభను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. రైతు గర్జన సమరభేరి సభకు రావాలని కోరుతూ మంగళవారం కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ను వారి నివాసంలో నాయకులతో కలసి పోలాడి రామారావు ఆహ్వాన పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు మద్దతు ప్రకటించి రామారావుతో కలిసి రైతు గర్జన గోడ ప్రతులను ఆవిష్కరించారు.


ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రైతులకు ఇఛ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. పంటల కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా నేటికీ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. మద్దతు ధరతో పాటుప్రభుత్వం ప్రకటించిన 500 రూ. బోనస్ ను అడిగితే రక రకాల కోర్రీలు పెడుతున్నారని, కొనుగోళ్లలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకే పాలకులు ఇదంతగా చేస్తున్నారని పోలాడి రామారావు ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలో అన్నదాతల సమస్యలు పరిష్కరించాల్సిన కింది స్థాయి అధికారులే మామూళ్లకు కక్కుర్తి పడి రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు 5 నుండి 8 కిలోలు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని మండి పడ్డారు. ఏ గ్రేడ్ దాన్యాన్ని కామన్ గ్రేడ్ క్రింద రైస్ మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నా అధికారులు తమ కేమి పట్టనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి అని అన్నారు. రైతులు దాన్యాన్ని ఎండ బెట్టే క్రమంలో ఎండలకు తాళ లేక రైతులు మృత్యు వాత పడటం కలచి వేసిందన్నారు. కొనుగోలు సెంటర్లలో లారీలు, హమాళీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. మిల్లుల వద్ద దాన్యం దిగుమతి ఆలస్యం చేయొద్దని అన్నారు. అన్ని రకాల పంటలకు 500 రూ. బోనస్ ను వెంటనే రైతుల అకౌంట్లలో జమ చేయాలన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా వైఫల్యం చెందిందన్నారు. పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులు యాసంగి ప్రారంభంలో ఇవ్వాల్సిన డబ్బులు యాసంగి పూర్తయినప్పటికి నేటికీ రైతుల అకౌంట్లలో పూర్తిగా జమ చేయక పోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి ఏపాటిదో అవగత మవుతుందన్నారు. అన్నదాతలకు ఇఛ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న కరీంనగర్ లో రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జస సమర భేరి సభను నిర్వహించనున్న సభకు భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పోలాడి రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోతె గంగారెడ్డి, మెరుగు సంపత్, ఎర్రబెల్లి సంపత్ రావు, పంజాల శ్రీనివాస్,రంగుభాస్కరాచారి,కేశవరెడ్డి, గౌతం రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు మహా గర్జన పోస్టర్ ఆవిష్కరించి, జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావును సత్కరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్





