
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రజల మనసులనే కాదు తెలుగు ప్రజలందరి ఆధారాభిమానాలను పొందుతున్న నాయకుల్లో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అగ్రగణ్యులు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. న్యాయవాద వృత్తి నుంచి ఆకస్మికంగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తన కార్యదక్షత, ప్రజాసేవా దృక్పథం, పారదర్శకతతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అధికార పక్షానికే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా గౌరవాభిమానాలు పొందుతున్న ఆయన, సర్వజన హృదయ నాయకుడిగా ఎదుగుతున్నారు. పేదలకు న్యాయం నీతి అందించాలనే పట్టుదలతో న్యాయ శాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించారు. న్యాయవాదిగానే స్థిరపడాలనుకున్నారు. దేశంలో పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో 1998లో న్యాయవాద వృత్తి చేపట్టారు శ్రీధర్ బాబు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే తన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు గారి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
1999 ఏప్రిల్13న తన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావుని నక్సలైట్లు కాల్చిచంపారు. శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత నైతిక విలువలు గల ప్రజాస్వామ్యవాదిగా పేరుగాంచారు. మంథని నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో మౌలిక వసతులు, సాగునీరు, విద్యారంగ అభివృద్ధికి ఆయన బలమైన పునాది వేశారు. 1990 నుండి 1994 మధ్య కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు అతీతంగా, సభను నిష్పక్షపాతంగా మరియు రాజ్యాంగబద్ధంగా నడిపిస్తూ అసెంబ్లీ హుందాతనాన్ని పెంచిన స్పీకర్‌గా చరిత్రలో నిలిచిపోయారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయన ప్రజలకు దూరం కాలేదు. 1999 ఏప్రిల్‌లో ఒక సాధారణ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లిన సమయంలో నక్సలైట్ల చేతిలో ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆకస్మికంగా జరిగిన ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, తీరని గుండెకోతకు గురిచేసింది. దుద్దిళ్ల కుటుంబంతో పాటు మంథని ప్రాంతాన్ని ఒక పెద్ద విషాదం కమ్మేసింది. తన తండ్రి ఆకస్మిక మరణం వల్ల తాను, తన కుటుంబం బాధాతప్తత శోకంలో ఉండగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని శ్రీధర్ బాబు కొనసాగించాలని సన్నిహిత బంధు మిత్రులు ఒత్తిడి పెంచారు. అదే సమయంలో మంథని నియోజకవర్గ ప్రజలు శ్రీపాద రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి శ్రీధర్ బాబు వైపు చూశారు. ప్రజల కోసం నిలబడటం తన బాధ్యతగా భావించిన ఆయన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు అదే ఏడాది జరిగిన 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి చందుపట్ల రాంరెడ్డిపై 15 వేల ఓట్ల మెజారీతో విజయం సాధించారు. అలా ఆయన రాజకీయ ప్రజా ప్రస్థానం మొదలైంది. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా కేవలం 30 ఏళ్ల వయస్సులోనే ప్రజాప్రతినిధిగా ఎన్నికై నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా సన్నిహితంగా అందుబాటులో ఉంటూ వారి బాగోగులను పర్యవేక్షిస్తూ వారి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. రాజకీయాలు మాత్రమే కాదని ఎమ్మెల్యేగా ప్రజల మధ్య సేవా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు 1990 నుండి 1994 వరకు శాసనసభా స్పీకర్ గా బాధ్యతలను నిర్వర్తించారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన తన తండ్రి మాదిరిగానే ప్రజల మధ్య ఉంటూ మంథని ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక సోషల్ వర్కర్ గా పేరుగాంచుతూ మంథని ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారనడానికి శ్రీధర్ బాబు ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనం. ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం శ్రీధర్ బాబు రాజకీయ జీవన విధానంగా మారింది.
1969 మే 30న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో దుద్దిళ్ల శ్రీపాదరావు, జయమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించిన ముద్దుబిడ్డ శ్రీధర్ చిన్ననాటి నుంచే చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచేవారు. వ్యక్తిగత, సామాజిక అవసరాల రీత్యా తన తండ్రి వద్దకు వచ్చే సామాన్య ప్రజల సమస్యలను దగ్గరగా గమనించేవారు. అలాగే రాజకీయ నాయకత్వాన్ని కూడా నిశితంగా పరిశీలించేవారు. తన తండ్రిలాగా తాను కూడా పేదలకు తనదైన రీతిలో న్యాయం చేయాలని బాల్యదశలోనే నిర్ణయించుకున్న శ్రీధర్ బాబు న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి అందులో ప్రావీణ్యత పొందారు. సమాజానికి ఉపయోగపడాలని న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. కానీ ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చారు. సమాజానికి ఉపయోగపడే నాయకుడిగా ఎదగాలని సంకల్పించారు.
రాజకీయంగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1999లో మొదటిసారి ఎమ్యెల్యేగా గెలిచిన శ్రీధర్ బాబు 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2004 నుండి 2012 వరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2004 నుండి 2006 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ 12వ శాసనసభ విప్ గా, 2009 నుండి 2010 వరకు ఉన్నత విద్యా మరియు ఎన్నారై శాఖా మంత్రిగా, 2010 నుండి 2014 వరకు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, ఎన్నారై తెలుగు ప్రజల కోసం ప్రత్యేక పథకాలు, ఒక్క రూపాయికే కిలో బియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు, శాసనసభను సజావుగా నడిపించడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడంలో తనవంతు పాత్ర పోషించారు. సామాజిక సాంస్కృతిక విద్యార్ధి ఉద్యమ నాయకులకు ఎందరికో మెంటార్ గా వ్యవహరించారు. తెలంగాణ ఆవశ్యకతను బలంగా వినిపిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. పార్టీ జాతీయస్థాయి నాయకత్వంపై ఒత్తిడి పెంచారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపట్ల శ్రీధర్ బాబుకున్న చిత్తశుద్ధికి నిదర్శనం
చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఆసక్తి కలిగిన శ్రీధర్ బాబు కాలేజీ దశలో క్రికెట్ జట్టు నాయకత్వం వహించారు. 2014 నుంచి 2016 వరకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) చైర్మన్‌గా పనిచేసి యువ క్రీడాకారులను ప్రోత్సహించారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా, కర్ణాటక ఇన్చార్జిగా వ్యవహరించి పార్టీ విజయానికి కృషి చేశారు. 2022 నుండి 2024 వరకు కర్ణాటక రాష్ట్ర ఇంచార్జిగా వ్యవహరించి కల్యాణ కర్ణాటక ప్రాంతంలో 41 స్థానాలకు గాను 26 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తన రాజకీయ చతురతను ప్రదర్శించి అధిష్టానం వద్ద తన పేరును నిలుపుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు నిర్వహించి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి గెలుపొందిన శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా అనేక దేశాలు పర్యటిస్తూ తెలంగాణను పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. నిరంతరం రాష్ట్రాభివృద్ధికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పని చేస్తున్నారని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు బహిరంగ వేదికలపై ప్రశంసించడం శ్రీధర్ బాబు పనితనానికి ఒక సూచిక. ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిత్వ బాధ్యతలను శ్రీధర్ బాబు చేపట్టినప్పటినుండి ఆయన తెలంగాణను సరికొత్త సాంకేతిక శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం సాఫ్ట్వేర్ హబ్‌గానే కాకుండా, ప్రపంచ కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) రాజధానిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఆయన కృషి చేస్తూ, కేవలం నగరాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు కూడా సాంకేతికతను విస్తరిస్తూ, డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, గ్లోబల్ ఏఐ సమ్మిట్, ఏఐ యూనివర్సిటీ వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణను అంతర్జాతీయ డిజిటల్ మ్యాప్‌లో అగ్రగామిగా నిలిపేందుకు పలు విప్లవాత్మక విధానాలను మరియు ప్రాజెక్టులను ముందుకు తెచ్చారు.
భారతదేశ జీడీపీలో తెలంగాణ వాటాను 2047 నాటికి 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ సుదూర వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను తెలంగాణ రైజింగ్ విజన్ 2047 (Telangana Rising Vision 2047) పేరుతో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వంటి మెగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. హైదరాబాద్ వేదికగా “లాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్”గా మార్చేందుకు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ (2026–2030) అనే బయోఏషియా విధానాన్ని తెచ్చారు. దీని ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో అధిక మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాక 5 లక్షల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశ్రమల స్థాపనను మరింత సులభతరం చేయడానికి EoDB 2.0 ను తెస్తున్నారు. అలాగే నగర పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమలను తరలించి, పారిశ్రామిక భూములను ఆధునీకరించేందుకు ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ (HILTP)’ గైడ్‌లైన్స్ మరియు ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజల ముంగిటకే వేగంగా, పారదర్శకంగా అందేలా సరికొత్త డిజిటల్ పరిపాలన సంస్కరణలను అమలు చేస్తున్నారు. ఇటీవల అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్(Analytics India Magazine) ప్రకటించిన “ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025” జాబితాలో శ్రీధర్ బాబుకు చోటు దక్కడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇటీవల అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్(Analytics India Magazine) ప్రకటించిన “ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025” జాబితాలో శ్రీధర్ బాబుకు చోటు దక్కడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
తన తండ్రి ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రజల సంక్షేమం కోసం మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. తన సొంత నియోజక వర్గమైన మంథని వంటి గ్రామీణ ప్రాంతాలలో టాస్క్ (TASK – తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన 10 మండలాల్లో (మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పాలకుర్తి, కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, మల్హర్రావు, పలిమెల) సీసీ రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవతో కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. మంథని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నారు. స్థానిక పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడంతో పాటు ఎండకాలంలో విద్యార్థుల కోసం ‘కంప్యూటర్ ఎడ్యుకేషన్, AI & రోబోటిక్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ వంటి సూపర్ సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తూ గ్రామీణ విద్యార్థులను ఫ్యూచర్-రెడీగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ యువతకు సాఫ్ట్వేర్ మరియు ఆధునిక సాంకేతిక రంగాలలో ఉపాధి లభించేలా మంథని ప్రాంతంలో ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ (TASK) శిక్షణా కేంద్రాలను విస్తరించారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో రూ. 80 లక్షల వ్యయంతో నూతన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి విద్యుత్ సమస్యలను అధిగమించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే మంథని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని నిరంతరం సందర్శిస్తూ అక్కడి వైద్య సదుపాయాల ఆధునీకరణను పర్యవేక్షిస్తున్నారు. దక్షణ కాశీగా పేరుపొందిన త్రివేణి సంగమ క్షేత్రం కాళేశ్వరం అభివృద్ధికి వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. శ్రీధర్ బాబు గారు అటు రాష్ట్ర ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తూనే తన సొంత నియోజకవర్గమైన మంథనిని గ్రామీణ ప్రగతికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కొత్త పరిశ్రమలను తీసుకురావడం, సమగ్ర డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంలో, మహిళా సాధికారతకు శాంకేతిక రంగాన్ని జోడించడం, సిటిజెన్ చార్టెడ్ సేవల్ని మీసేవ ద్వారా సరళీకృతకు కృషి చేయడం ఆయన సేవా తత్వానికి ప్రతీక. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజల సమస్యలను ఓపికగా విని పరిష్కరించేందుకు కృషి చేసే సహృదయ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. పారదర్శక పాలన, ప్రజాసేవ, నిష్కళంకత, మానవీయత కలగలిపిన నాయకత్వంతో ముందుకు సాగుతున్న శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరస్థాయిగా నిలవాలని కోరుకుంటూ, ఆయన జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

(30-05-2026) శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా)
ఇనుగాల భీమారావు
అడ్వకేట్, సామాజిక-రాజకీయ విశ్లేషకులు





