Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపెల్లి గ్రామ శివారులో మొన్న రాత్రి జరిగిన అంకుశాపూర్ హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. సోమవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (40)ను సోమవారం ఉదయం అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడన్నారు. తన వ్యవసాయ భూమి సమీపంలో వ్యవసాయం చేస్తున్న ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆ మహిళపై మృతుడు పైతరి మొగిలి అత్యాచార యత్నానికి పాల్పడగా తాను ఆమెకు అండగా నిలిచి పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిపాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత మృతుడు తనను తరచూ అవమానిస్తూ, దూషిస్తూ ఉండటంతో పాటు కుటుంబ సమస్యలకు కూడా అతడే కారణమని భావించి కక్ష పెంచుకుని హత్యకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించినట్లు ఏసీపీ చెప్పారు.
ఈ నెల 27న పీర్ల పండుగ సందర్భంగా మడిపెల్లి గ్రామానికి వచ్చిన మృతుడిని గమనించిన నిందితుడు ముందుగా యూట్యూబ్‌లో హత్యలు ఏ విధంగా చేయవచ్చు, దొరకకుండా ఎలా తప్పించుకోవచ్చు అనేదానిపై హత్యలకు సంబంధించిన వీడియోలు, ఆయుధాల తయారీ విధానాలను శోధించిన అనంతరం ఇనుప రాడ్‌తో అంకుశాపూర్ వెళ్లే రోడ్డుపై అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తెలిపాడన్నారు.
నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న లుంగీ, నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్, యూట్యూబ్ శోధనలు చేసిన మోటరోలా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఘటనలో ఉపయోగించిన హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మాధవి తెలిపారు. కేసులో దర్యాప్తు ఇంకా లోతుగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
కేసు దర్యాప్తులో విశేష కృషి చేసిన జమ్మికుంట సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్, ఎస్సై రవి, ఏఎస్ఐ సంపత్తో పాటు దర్యాప్తు బృందంలోని పోలీసు సిబ్బందిని ఏసీపీ వాసంశెట్టి మాధవి అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరిస్తూ, ప్రజలు ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
విలేకరుల సమావేశంలో జమ్మికుంట సీఐ ఎస్ రామకృష్ణగౌడ్, ఎస్సై రవి, ఏఎస్ఐ సంపత్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.





