
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గంగన కుంట కాలువ ఆయకట్టు రైతులు సమస్యలు, శిథిలావస్థకు చేరిన కల్వర్టు, గంగనకుంట కాల్వకు గండి తదితర సమస్యలను మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసినికి ఐదో వార్డు ప్రజలు ఏ కరువు పెట్టారు. ఆదివారం హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని ఐదో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. అనంతరం ఐదో వార్డు కౌన్సిలర్ సొల్లు సునీతతో కలిసి వార్డులో ఆమె పర్యటించింది. ఈ సందర్భంగా పాల్గొని వార్డు ప్రజలు మాట్లాడుతూ… గంగనకుంటకు ఉండే మూడు తూములలో ఒకటి మాత్రమే ఉందని మిగతావి మూసి వేశారని అందువల్ల గంగనకుంటకు వచ్చే నీరు ఆయకట్టు రైతులకు అవసరం తీర్చాల్సి ఉండగా ఆ నీరు నేరుగా గుండ్ల చెరువులోకి వెళ్తుందని దీనివల్ల గంగనకుంట పరిసర ప్రాంతాల్లోని ఆయకట్టు రైతుల నీటి అవసరాలు తీర్చడం లేదని అన్నారు. మురికి నీరు గంగన కుంటలో కలవకుండా చూడాలని కోరారు. కల్వర్టు శిథిలావస్థకు చేరగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే పాత కల్వర్టు ఉన్న ప్రాంతంలో నూతన కల్వర్టు నిర్మించాలని కోరారు. కిందివాడలో వీధిలైట్లు లేకపోవడం వల్ల పలువురు వ్యక్తులు ఆసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని వాటిని అరికట్టడానికి వీధిలైట్లు వేయడమే కాకుండా పోలీస్ పహారా జరిగే విధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. వార్డు ప్రజలు విన్నవించిన సమస్యలను విన్న చైర్పర్సన్ సుహాసిని మాట్లాడుతూ…వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వీటి పరిష్కారానికి త్వరపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, హనుమాన్ దేవస్థాన చైర్మన్ కొలిపాక శంకర్, వార్డు ప్రముఖులు పాక సతీష్,సిద్దమల్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

గంగన కుంట ఆయకట్టు సమస్యలు చైర్ పర్సన్ సుహాసినికి వివరిస్తున్న స్థానికులు..







