
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ కడుపు నుండి నాలుగు కిలోల కణతి తొలగించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఔరా…!! అనిపించారు. వివరాలలోకి వెళితే….

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణికుంట్ల కొమరమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. తన తన సమస్య తీర్చుకోవడం కోసం ఎన్నో ప్రైవేటు ఆసుపత్రులు తిరిగింది. దానిని తొలగించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పడంతో నిరుపేద అయిన ఆమె తన వద్ద అంత డబ్బు లేదని బాధపడింది. కానీ శస్త్ర చికిత్స తప్పనిసరిగా చేసుకోవలసిన అవసరం రావడంతో హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఆమె చికిత్స కోసం గత రెండు రోజుల క్రితం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి ఆర్ఎంఓ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపు నుండి సుమారు నాలుగు కిలోల బరువు గల కణతిని తొలగించారు. ప్రస్తుతం మహిళా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.


—శ్రీకాంత్ రెడ్డి కి ప్రశంసలు
ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయల ఖర్చుతో జరిగే ఆపరేషన్ ను ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డిని డిసి హెచ్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, సూపరిండెంట్ డాక్టర్ జీ రవీందర్ లు అభినందించారు.





