
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని ఆర్థికంగా మోసం చేస్తూ, పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న జిల్లాలోని సీడ్ ప్లాంట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతాంగానికి న్యాయంగా రావలసిన డబ్బులు ఇప్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.

శనివారం రోజున స్థానిక పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ కే చంద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ హుజరాబాద్ నియోజవర్గంలో పెద్ద ఎత్తున రైతులు వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తారని, ఉత్పత్తి చేసిన విత్తనాలను సీడు ప్లాంట్లకు విక్రయిస్తారన్నారు.
సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ యాసంగి సీజన్ గాను ధరలు నిర్ణయించి రైతాంగంతో అగ్రిమెంట్ చేసుకున్నారని, దీంతో రైతులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి పంటలు పండించి అగ్రిమెంట్ చేసుకున్న ఒప్పందం మేరకు ఆయా సీడ్
ప్లాంట్ లో విక్రయించారన్నారు. రైతుల కష్టం సీడ్ ప్లాంట్లకు చేరిన తర్వాత సీడ్ ప్లాంట్ యజమానులు ధరలు తగ్గిస్తూ నిర్ణయం చేయడం రైతులను మోసం చేయడమే అన్నారు.
2025 నవంబర్లో చేసిన అగ్రిమెంట్ ను తుంగలో తొక్కి 2026 మే లో రైతులను దోచుకునే మరో అగ్రిమెంటు రాసుకున్నారని గుర్తు చేశారు. పంట పండించక ముందు ఒక అగ్రిమెంటు పండించిన తర్వాత సీడు ప్లాంట్లకు ధాన్యం వెళ్లిన తర్వాత మరో అగ్రిమెంటు తయారుచేసి రైతుల నోట్లో మట్టి కొట్టే సీడ్ ప్లాంట్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం రైతుల నుండి తరుగు పేరుతో తూకం పేరుతో కోతలు విధిస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా గడించి బడా బాబులుగా చలామణి అవుతున్న సీడ్ ప్లాంట్ యజమానులపై నాన్ బెలేబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 2025లో ఉన్న అసోసియేషన్ కమిటీ చేసిన తీర్మానాన్ని కాదని అసోసియేషన్ కమిటీ మారడంతో 2026 లో నూతన కమిటీ రైతులను నిలువునా దోపిడీ చేసే తీర్మానం చేసిందన్నారు.
రైతులతో ఒప్పందాలు చేసుకొని పంట పండిన తర్వాత మిల్లుల్లో చేరిన తర్వాత ధరలు తగ్గించడం రైతుల గొంతు నులకడమేనన్నారు. ఒప్పందం ప్రకారం మాకు వరి ధాన్యం డబ్బులు చెల్లించాలనిసీడ్ ప్లాంట్ యజమానులను రైతులు అడిగితే తగ్గించి ఇస్తాం మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అంటూ రైతులను సీడ్ ప్లాంట్ యజమానులు అవమాన పరుస్తూ బెదిరిస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు
సీడ్ ప్లాంట్ల యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, రైతాంగానికి న్యాయంగా రావలసిన డబ్బులు ఇప్పించని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని లేని ఎడల అర్హులైన పేదలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ విద్యా, వైద్య రంగాల్లో మౌలిక వసతులు కల్పించి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా, వైద్య రంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు.
రైతులకు అవసరమైన యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువులు, సరిపడా విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఎలాంటి కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు నష్టం చేసే యూరియా యాప్ ను రద్దుచేసి రైతాంగానికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. 8 రకాల వరి వంగడాలకే బోనస్ చెల్లిస్తామని అధికారులు, ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఇతర రకాల నార్లు పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ గతంలో ప్రకటించిన 33 రకాల వరి వంగడాలకు బోనస్ యధావిధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తగిన విధంగా పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు నష్టం కలిగించే మూడవ రైతు డిస్కౌంను రద్దు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గడుతూ ఆగస్టు చివరి వరకు గ్రామాల్లో సభలు, సమావేశాలు, చర్చ గోస్ట్ లు, సదస్సులు నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ మండల కమిటీ సభ్యులు ప్రతాప శ్రీనివాస్ కొంకట చంద్రయ్య, ఇమ్మడి దేవేందర్, అజ్జు, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.





