
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ గత 21 రోజులుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న మెగసెసే అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయాలు తెలపడానికి అవకాశం లేదా అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఢిల్లీలో గత 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్ చుక్ డిమాండు సరైనదని అన్నారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ప్రభావం చూపిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించకుండా కనీసం ఆయనతో చర్చలు చేయకుండా ఆయన దీక్షను భగ్నం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






