
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందనీ.. సీపీ గౌస్ ఆలం వైఫల్యం వళ్లనే ననివ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు.
కరీంనగర్ జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు, దోపిడీలు, చోరీలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని, జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇటీవల కరీంనగర్ భగత్‌నగర్‌లో దుండగులు కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి 72 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.21 లక్షల నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లను దోచుకెళ్లడం, అంతకుముందు పీఎంజే జ్యువెలరీ దోపిడీ, హుజూరాబాద్‌లో మామిండ్లవాడ మహిళ హత్య, మెడికల్ షాప్ ఎదుట బైక్ చోరీ, నిర్వాణ హోటల్, అన్నపూర్ణ థియేటర్ పరిసరాల్లో వరుస దొంగతనాలు, అలుగునూరు వద్ద అడ్వకేట్‌పై హత్యాయత్నం వంటి ఘటనలు పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.
“కరీంనగర్ సీపీ గౌస్ ఆలం… మీరు నేరాలను అరికట్టడానికా? లేక ఘటనలు జరిగిన తర్వాత మీడియా సమావేశాలు పెట్టడానికా?” అంటూ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలన కేసుల్లో ఇప్పటికీ ప్రధాన నిందితులను అరెస్ట్ చేయలేకపోవడం, అసలు నేరస్తులను పట్టుకునే బదులు కేసులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులకు భయం లేకుండా పోయిందని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ బలహీనపడిందని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాలని, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను వెంటనే ఛేదించాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
లేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, ప్రతి నేరానికి ప్రభుత్వం, పోలీసు శాఖే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
*లోకల్ యాడ్స్*
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ కంచి వేణు గారు, ఎంవీఐ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





