
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు 8: హుజురాబాద్‌లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు, అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు అందుబాటులోకి తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ శనివారం డిమాండ్ చేశారు.
24 గంటల అత్యవసర వైద్య సేవలు సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విషపదార్థాలు సేవించిన వారితో పాటు ఇతర అత్యవసర కేసులను అవసరం లేకపోయినా వేరే ఆసుపత్రులకు రేఫర్ చేస్తున్నారని పలువురు రోగులు తెలిపారన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నరని రోగులు కొందరు, వారి బంధువులు వాపోతున్నారని మహేందర్ తెలిపారు. వైద్య సేవలపై నిరాశతో ఆసుపత్రిలో చికిత్స పొందలేమని పేర్కొంటూ సంతకాలు చేసి వెళ్లి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగి బంధువులు ఆరోపించారు. సిబ్బంది రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
గర్భిణులు, చిన్నారులకు సేవలు అందించాలి:
ఆసుపత్రిలో స్కానింగ్, ల్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు రోగులను వాటి కోసం బయటకు పంపిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. గర్భిణులు, చిన్నారులకు అవసరమైన పరీక్షలు, వైద్య సేవలను ఆసుపత్రిలోనే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందే వరకు ఈ అంశంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.





