
-న్యాయపోరాటానికి అండగా ఉంటానని హామీ…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: గ్రామీణ ప్రాంత సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రజాసేవలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల నివేశన స్థలాలపై అడ్డంకులు సృష్టించడం సరికాదని మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.హుజూరాబాద్‌లో గత ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో కేసు వేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి.
దీక్షకు ముందు జర్నలిస్టులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీతో పాటు స్వామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సందర్శించి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.



మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం నిబంధనల ప్రకారం ప్రభుత్వం జర్నలిస్టులకు స్థలాలు కేటాయించిందని గుర్తుచేశారు. పట్టాలు పొందిన జర్నలిస్టులు ఒక్కొక్కరు రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు వెచ్చించి చిన్నపాటి గదులు నిర్మించుకుని, విద్యుత్ సౌకర్యం కూడా పొందారని తెలిపారు. వారు నివాసయోగ్యంగా మలుచుకుంటున్న సమయంలో కావాలని కేసు వేసి ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర అన్యాయమన్నారు.
న్యాయపరమైన పోరాటానికి పూర్తి సహకారం…
“ప్రజా సమస్యలపై గళమెత్తే జర్నలిస్టులు ఇవాళ తమ హక్కుల సాధన కోసం రోడ్డున పడి దీక్షలు చేయాల్సి రావడం బాధాకరం, దౌర్భాగ్యం” అని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాలను అడ్డుకోవడం ప్రజాప్రతినిధుల లక్షణం కాదని హితవు పలికారు. కేసు వేసిన నాయకుడితో వ్యక్తిగతంగా మాట్లాడి కేసు ఉపసంహరించుకునేలా చూస్తానని, అవసరమైతే న్యాయ నిపుణుల ద్వారా ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం, జిల్లా మంత్రి చొరవ చూపాలి…
పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత జిల్లా మంత్రిపై ఉందని ఆయన పేర్కొన్నారు. బాధ్యులైన నాయకులతో పాటు జర్నలిస్టులను చర్చలకు పిలిచి వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాటవేత ధోరణి వీడి, జర్నలిస్టులకు స్థలాలను అప్పగించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. సమస్య కొలిక్కి వచ్చేంత వరకు జర్నలిస్టుల వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు.

కాగా, ఈ దీక్షలకు పీవీ సేవా సమితి సైతం మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి నాయకులు బి. మనోజ్ కుమార్, తూము వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు అకినపల్లి శిరీష తదితరులతో పాటు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





