
—ఓటర్ల సవరణలో అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులా?
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మరోసారి అరెస్టు చేయడాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.
ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేపడుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను వరుసగా రెండో రోజు అరెస్టు చేయడం అత్యంత అప్రజాస్వామికమని మంత్రి పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించడం ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కు అని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడి పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు నిర్వహించనున్న నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం జరిగే ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి కోరారు.
అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు
అక్కన్నపేట: అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. సర్పంచ్ సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అక్కన్నపేట మండల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





