
-సార్త్విక్ షార్ట్ ఫిలిం కు అమెరికాలో అవార్డులు
-విమర్శకుల ప్రశంసలు అందుకున్న సార్త్విక్





మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 19 : అమెరికాలో నివసిస్తున్న హుజురాబాద్ పట్టణానికి చెందిన సార్త్విక్ బొల్లు అంతర్జాతీయ వెండితెరపై రాణించారు. సార్త్విక్ తెరకెక్కించిన షార్ట్ ఫిలిం “ది రోడ్ నాట్ టేకెన్” అంతర్జాతీయ సినీ వేదికలపై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హుజురాబాద్ పట్టణానికి చెందిన బొల్లు రాజేందర్ – వరూధిని (మహీజ మెడికల్) దంపతుల కుమారుడైన సార్త్విక్ బొల్లు ప్రాథమిక విద్యాభ్యాసం హుజురాబాద్ లోని వివేకవర్ధిని పాఠశాలలో, ఉన్నతవిద్య హనుమకొండ తేజస్వి పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్ లోని నారాయణ విద్యాసంస్థలో పూర్తి చేసారు. ఇంజనీరింగ్ హైదరాబాద్ లోని సెయింట్ మార్టిన్ కళాశాలలో, అమెరికాలోని హూస్టన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ 2017 లో పూర్తి చేసారు. అనంతరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే.. తక్కువ నిడివిగల చిత్రాలు తీసే ప్రయత్నం చేస్తున్నాడు.
చిన్నప్పటి నుండే సినిమాలపై ఆసక్తి
సార్త్విక్ చిన్నప్పటి నుండి సినిమాలపై ఆసక్తి కలిగి ఉన్నాడు. తన పిజి పూర్తయిన తర్వాత సార్త్విక్ ఫిలిం ఇన్టిట్యూట్లో లేదా ఫిలిం స్కూల్ లో చేరి శిక్షణ తీసుకోవాలని భావించినా.. ఉద్యోగ బాధ్యతల కారణంగా వీలు కాలేదు. తనకు విభిన్న భాషల, దేశాల సినిమాలు, డాక్యుమెంటరీలు చూడడంతో పాటు పాటు పేరొందిన రచయితల బుక్స్ చదివే అలవాటు ఉంది. అమెరికా లో ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత తన సినిమా తీయాలనే అనే కలను, చిరకాల కోరికను నెరవేర్చుకుందుకు సిద్దమయ్యాడు. ఇందుకు మొదటిమెట్టుగా తక్కువ నిడివి ఉన్న సినిమా తీసేందుకు సన్నద్దమయ్యాడు. ఇందుకుగానూ అమెరికాకు చెందిన కవి రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన “ది రోడ్ నాట్ టేకెన్” కవితలోని సారాంశాన్ని, దీంతోపాటు జర్మన్ నావెలిస్ట్ ఫ్రాంజ్ కాఫ్కా రాసిన “మెటమార్ఫోసిస్” నవలలోని విషాదభరితమైన స్టోరీ ఆధారంగా తానే ఒక కథ రాసుకుని షార్ట్ ఫిలిం గా తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ షార్ట్ ఫిలిం పేరు కూడా “ది రోడ్ నాట్ టేకెన్”. ఇది 14 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం. సార్త్విక్ తానే దర్శకుడుగా, ఎడిటర్ గా దీన్ని తెరకెక్కించాడు. మానవ సంబంధాలు, మానసిక సంఘర్షణ, భావోద్వేగాలు ఇతివృత్తంగా ఈ షార్ట్ ఫిలిం ఉంటుంది. ఈ షార్ట్ ఫిలిం పలు అవార్డులు గెలుచుకుంది. అమెరికాలో ప్రముఖ సంస్థ ఇండిమీమ్ సార్త్విక్ తీసిన ఈ షార్ట్ ఫిలిం కు “ఆర్డియన్స్ ఛాయిస్ అవార్డు” అందజేసింది. అలాగే ఈ షార్ట్ ఫిలిం ను పలు దేశాల్లోని అవార్డులు అందజేసే ప్రముఖ సంస్థలకు పంపించగా వారి ప్రశంసలు అందుకుంది. దీనికి మరిన్ని అవార్డులు రానున్నాయి. సార్త్విక్ ఉద్యోగం చేస్తూనే తనకున్న ఫ్రీ టైం లో సార్త్విక్ షార్ట్ ఫిలింలపై దృష్టి పెట్టాడు. షార్ట్ ఫిలిం లో తనకు అందుబాటులో ఉన్న నటులను తీసుకుంటున్నాడు. ఇతర సాంకేతిక సహకారం కూడా తానే సమకూరుస్తున్నాడు. సాత్విక్ సతీమణి హుజురాబాద్ కే చెందిన విజయ్ – జ్యోతి దంపతుల కుమార్తె ప్రత్యూష కూడా షార్ట్ ఫిలిం తీసేందుకు తన అభిరుచికి అనుగుణంగా పూర్తిగా సహకరించి ప్రోత్సహిస్తోంది. సార్త్విక్ తీసిన షార్ట్ ఫిలిం ను ప్రత్యూష ప్రమోట్ చేయడం గమనార్హం.
సినిమా తీయడమే లక్ష్యం : సార్త్విక్ బొల్లు
భవిష్యత్ లో పూర్తి నిడివిగల సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించి, సినిమాల ద్వారా మార్పు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని యువ దర్శకుడు సార్త్విక్ బొల్లు చెప్తున్నారు. ఏదైనా మంచి విషయాన్ని సందేశం ద్వారా రాతపూర్వకంగా చెప్తే ఎవరు పట్టించుకోరని, అదే ఒక దృశ్యం రూపంలో పంపితే.. సులభంగా చాలా మందికి చేరి ఆలోచింపజేస్తుందని సార్త్విక్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత – ప్రణయ్ ల సంఘటన తనను ప్రభావితం చేసిందని, ఇతివృత్తాన్ని “జాతి” పేరుతో తాను ఒక సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు అభ్యుదయ భావాలు కలిగిన యువ దర్శకుడు సార్త్విక్ తెలిపారు. పూర్తి నిడివి సినిమాలు తీయాలంటే.. ఆర్థిక వనరులు సహకారం అవసరం ఉంటుందని అన్నారు. భవిష్యత్ లో మరిన్ని మంచి సందేశాత్మక షార్ట్ ఫిలింలు తీయాలని భావిస్తున్నట్లు సార్త్విక్ తెలిపారు.
యూ ఎస్ ఛానెళ్లలో సార్త్విక్ ఇంటర్వ్యూలు
యువదర్శకుడు సార్త్విక్ బొల్లు తెరకెక్కించిన “ది రోడ్ నాట్ టేకెన్” పలు అవార్డులు అందుకున్న సందర్బంగా యూ ఎస్ లోని ప్రముఖ చానెళ్లు అతని ఇంటర్వ్యూను ప్రసారం చేసాయి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫారాలైన యూ ట్యూబ్, పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లలో ప్రముఖ ఫిలిం అవార్డుల సంస్థలు సార్త్విక్ ఇంటర్వ్యూలను పోస్ట్ చేసాయి. తన ఇంటర్వ్యూలతో సార్త్విక్ అంతర్జాతీయ వేదికపై ఆకట్టుకుంటున్నాడు.
అభినందనల వెల్లువ
అమెరికాలో నివాసముంటున్న హుజురాబాద్ పట్టణానికి చెందిన యువకుడు సార్త్విక్ బొల్లు ప్రతిభను, అభిరుచిని, నైపుణ్యాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. సార్త్విక్ షార్ట్ ఫిలిం “ది రోడ్ నాట్ టేకెన్” కు అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సార్త్విక్ తల్లిదండ్రులు బొల్లు రాజేందర్, వరూధిని దంపతులను పలువురు అభినందిస్తున్నారు. తమ కుమారుని షార్ట్ ఫిలిం కు అమెరికాలో అవార్డులు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసారు. సార్త్విక్ భవిష్యత్లో మరిన్ని సందేశాత్మక చిత్రాలు తీసి పేరు తెచ్చుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.