
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ
వారిపై చర్యలు తీసుకొని, వారిని పార్టీ నుండి బహిష్కరించిన DCC అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ
–కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణ – తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీస్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న, ఒళ్ళాల శ్రీనివాస్, ఎండి. సలీం, ఎండి. ఇమ్రాన్, ఎండి సలీం పాషా, వాసాల రామస్వామిలను పార్టీ నుండి బహిష్కరించడంతోపాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తుమ్మటి సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీస్ అందజేశారు.
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు పై ఉద్దేశపూర్వకంగా చేసిన విమర్శలు, కక్షపూరితంగా చేసిన అసందర్భ ఆరోపణలపై స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు అంతర్గతంగా చర్చించుకోవలసిన పార్టీ విషయాలను బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న, ఒళ్ళాల శ్రీనివాస్, ఎండి. సలీం, ఎండి. ఇమ్రాన్, ఎండి సలీం పాషా, వాసాల రామస్వామిపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వీరిలో కొంతమంది పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలోకి వలస వెళ్లడం తిరిగి రావడం బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు ఆ పార్టీలకు చెందిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వంపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించిందన్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుల నాయకత్వంలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి ఓటు వేసినప్పటికీ ఇదంతా తమ ద్వారానే జరిగిందని కేవలం తాము కష్టపడడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయి తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ అగ్ర నాయకుల ప్రభావం ఏమీ లేదని గత నాలుగైదు మాసాల కింద కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ సిద్ధాంతాలు తెలియని వ్యక్తులు నియోజకవర్గానికి సంబంధంలేని నాయకుల ప్రమేయంతో పత్రిక విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అయోమయం కలిగే విధంగా ప్రవర్తించడాన్ని, కార్యక్రమాలు చేపట్టడాన్ని, వ్యవహరించడాన్ని జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వీరిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చెన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు వారి ఆదేశానుసారం ఈ విధమైన చర్యలకు ఇక ముందు ఎవరూ సాహసించకుండా చేపట్టే కార్యాచరణలో భాగంగా పైన తెలుపబడిన నాయకులను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పత్రిక ముఖంగా తెలియజేశారు..
ఈ క్షణం నుండి వీరికి కాంగ్రెస్ పార్టీతో గాని, కాంగ్రెస్ పార్టీకి వీరితో గాని ఎలాంటి సంబంధాలు లేవనే విషయాన్ని స్థానిక నాయకులు, మరియు మీడియా మిత్రులు గుర్తించాలని తెలియజేశారు.
అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుడని తనకు తానే ప్రచారం చేసుకుంటున్న జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వ్యవహరించిన తీరును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వారిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన షోకాజ్ నోటీసు అందజేస్తూ వారికి ఈ నోటీసు అందిన నాటి నుండి వారం రోజుల లోపల వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తెలియజేశారు.