
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:
హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ని విమర్శించే స్థాయి తుమ్మేటి సమ్మిరెడ్డిది కాదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ లోని తన స్వగృహంలో ఆయన మాట్లాడారు. సమ్మిరెడ్డి తన అనుచరులతో పెట్టిన ప్రెస్ మీట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మొత్తాన్ని డీసీసీ అధ్యక్షుడికి వివరించడం జరిగిందని దానిపై పూర్తిస్థాయి విచారణ చేసిన పార్టీ పెద్దలు నోటీసులు కూడా సమ్మిరెడ్డికి అందించారన్నారు. దీంతోపాటు అతడి అనుచరులను కూడ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. సమ్మిరెడ్డి తన స్వలాభం కోసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడారని, ప్రణవ్ మంచితనంతో పార్టీలోకి తీసుకుంటే తిరిగి ప్రణవ్ పైనే ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఇక్కడ కొంతమంది పదేపదే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరును ప్రస్తావిస్తున్నారని, ఎమ్మెల్సీ వెంకట్ హుజురాబాద్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారా లేక ఎమ్మెల్సీని అడ్డుపెట్టుకొని ఇక్కడ నాయకులు ఏలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది ప్రణవ్ మీద ఆరోపణలు చేస్తూ వాట్సాప్ స్టేటస్ లు పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రణవ్ నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తీరుస్తూ, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు పార్టీ పటిష్టత కోసం ప్రయత్నం చేస్తున్నారని, కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్లడం జరుగుతుందని వారి వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రణవ్ పై విమర్శలు చేసే నాయకులు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అమ్ముడుపోయారా అని ఆయన ప్రశ్నించారు. ప్రణవ్ పై అసత్య ప్రచారాలు చేసిన పార్టీకి ఇబ్బందులు తలెత్తెల వ్యవహరించిన చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
