
- రోజుకు రూ. 50 లక్షలు వసూలు చేస్తున్న పొన్నం అన్న కొడుకు అనూప్
- కరీంనగర్ లో రేవంత్- పొన్నం టాక్స్ వసూల్
- ఎన్టిపిసి అధికారుల తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తా
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్/హైదరాబాద్: రామగుండం ఎన్ టిపిసిలో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, రోజుకు రూ.50 లక్షల రూపాయలు వసూలు చేయడంలో అతని అన్న కొడుకు అనూప్ పాలు పంచుకుంటున్నాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు కెపి వివేకానంద, డాక్టర్ కె సంజయ్ లతో కలిసి తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఓక్కో లారీలో 32 టన్నులు ఫ్లై యాష్ తరలించాల్సి ఉంటె 72 టన్నులు తరలిస్తున్నారని ఆరోపించారు. వే బిల్లుల్లోఎన్ని టన్నులు అని పేర్కొనడం లేదని, అదనంగా రోజూ తరలిస్తున్న ఫ్లై యాష్ కు 50 లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని చెప్పారు. ఈ డబ్బులు పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు అనూప్ వసూల్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న 13 లారీలను నేనే స్వయంగా పట్టుకున్నానని, కేవలం రెండు లారీలను సీజ్ చేసి రవాణా శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారని కౌశిక్ ఆరోపించారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒత్తిళ్లకు రవాణా శాఖ అధికారులు లొంగుతున్నారని పేర్కొన్నారు. ఆధికారులు తమ భాద్యతలు తాము నిర్వర్తించాలి తప్ప ఎవరికి లోంగవలసిన అవసరం లేదన్నారు. నేను లారీలు పట్టుకుంటున్నా అని హుజురాబాదుకు బదులు హుస్నాబాద్ మీదుగా లారీలను తరలిస్తున్నారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
పొన్నం ఎక్కడ్నుంచి తరలించినా బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారని హెచ్చరించారు. ఫ్లై యాష్ లారీలతో రోడ్డు ప్రమాదాలు కూడా జరగుతున్నాయని, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్ధి అఖిల్ ను ఫ్లై యాష్ లారి బలి తీసుకుందని ఆయన వెల్లడించారు.
అఖిల్ మరణంతోనే నాకు ఫ్లై యాష్ ఓవర్ లోడ్ లారీల గురించి తెలిసిందని చెప్పారు. అఖిల్ మరణం మంత్రి పొన్నంకు శాపంలా తగలడం ఖాయం అని షాపము పెట్టారు. ఎన్టిపిసి అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు ? ఆనీ ప్రశ్నించారు. తరలిస్తున్న ఫ్లై యాష్ వివరాలను ఎన్టిపిసి ఎందుకు దాస్తోంది ? అని, ఎన్ టి పి సి అధికారుల తీరుపై ఢిల్లీలో బిఆర్ఎస్ తరఫున ఫిర్యాదు చేస్తామని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఫ్లై యాష్ ఓవర్ లోడ్ దందా ఆపకపోతే మా పార్టీ ఎమ్మెల్యేల బృందం రామగుండం ఎన్ టిపిసిని సందర్శిస్తుందని స్పష్టం చేశారు. నేను ఆధారాలతో ఆరోపణలు చేస్తుంటే పొన్నం నా దిష్టి బొమ్మలు దహనం చేపిస్తున్నారని మండిపడ్డారు. పేదల శవాలపై పొన్నం పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూడు నాలుగు రోజుల్లో ఓవర్ లోడ్ లారీల దందా ఆపకపోతే మా కేడర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అధికారులు కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. తప్పు చేస్తున్న అధికారుల వివరాలను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నాం ..మేము అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తప్పవు అని కౌశిక్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో రేవంత్ పొన్నం టాక్స్ అమలవుతున్నట్లు మాకు అనుమానాలు ఉన్నాయని కౌశిక్ ఆరోపించారు.








